మొన్న డ్రోన్లు, నిన్న హెలికాప్టర్లు.. కొండపై మళ్లీ కలకలం
ఆమధ్య సర్వేకోసం డ్రోన్లు వినియోగించారనే సమాచారం బయటకు రావడంతో కలకలం రేగింది. ఇప్పుడు హెలికాప్టర్లు ఎగరడంతో భక్తులు మరింత ఆందోళనకు గురయ్యారు.
తిరుమల కొండపై ఆగమ శాస్త్ర నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తుంటారు అధికారులు. కానీ కొన్ని సందర్భాల్లో అనివార్యంగా వాటికి ఆటంకం ఏర్పడటం గమనిస్తూనే ఉన్నాం. ఆమధ్య తిరుమలలో డ్రోన్ కెమెరాల కలకలం రేగింది. డ్రోన్ కెమెరాలతో తీసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు హెలికాప్టర్లు కలకలం సృష్టించాయి. మూడు హెలికాప్టర్లు తిరుమల కొండపైనుంచి వెళ్లడం భక్తులను ఆందోళనకు గురి చేసింది.
మంగళవారం సాయంత్రం 3 హెలికాప్టర్లు తిరుమల కొండపై చక్కర్లు కొట్టాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్ ప్రాంతాల పైనుంచి హెలికాప్టర్ లు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. తిరుమలలో 3 హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై విజిలెన్స్ విభాగం అధికారులు ఆరా తీశారు. రేణిగుంటలోని విమానాశ్రయం ఏటీసీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ హెలికాప్టర్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందినవని, కడప బేస్ క్యాంప్ నుంచి చెన్నై వెళ్తుండగా తిరుమల ఉపరితలంలో చక్కర్లు కొట్టినట్టు గుర్తించారు.
తిరుమల నో ఫ్లయింగ్ జోనా..? కాదా..?
తిరుమల నో ఫ్లయింగ్ జోన్ అనేది భక్తుల నమ్మకం. తిరుమల కొండపై ఎలాంటి విమానాలు ఎగరకూడదని అంటారు, అందుకే అక్కడ డ్రోన్లను ఎగరేసే సాహసం కూడా ఎవరూ చేయరు. ఆమధ్య సర్వేకోసం డ్రోన్లు వినియోగించారనే సమాచారం బయటకు రావడంతో కలకలం రేగింది. ఇప్పుడు హెలికాప్టర్లు ఎగరడంతో భక్తులు మరింత ఆందోళనకు గురయ్యారు. తిరుమల మీదుగా హెలికాప్టర్లు, విమానాలు వెళ్లకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి గతంలో టీటీడీ విజ్ఞప్తి చేసింది. అయినా కూడా తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా కేంద్ర విమానయాన శాఖ గుర్తించలేదని టీటీడీ చెబుతోంది.