పవన్ వెంట మాజీ ఎమ్మెల్యేలు.. జనసేనలో కండువాల పండగ
మొత్తమ్మీద జనసేన ఆవిర్భావ సభలో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరబోతుండటం విశేషం. ఆ ముగ్గురు కూడా రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నారు.
ఈనెల 14న మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభ జరగబోతోంది. ఈ సభలో పవన్ కల్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. అయితే దానితోపాటు జనసేన కండువాల పండగ కూడా జరగబోతోంది. మాజీ ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నేతలు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది పేర్లు ఖరారయ్యాయి. మరికొంతమంది సడన్ ఎంట్రీ ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి.
వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. జనసేన ఆవిర్భావ సభలో ఆయన పవన్ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. రామారావుతోపాటు, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు కూడా జనసేనలో చేరబోతున్నారు. టీడీపీనుంచి బీజేపీలోకి వెళ్లిన ఆయన ఇప్పుడు బీజేపీ నుంచి జనసేనకు మారిపోతున్నారు. ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు టికెట్లకు సంబంధించిన హామీ వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం వైసీపీలో ఉన్న మరో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా జనసేన కండువా కప్పుకోబోతున్నారు. 2019లో టీడీపీ నుంచి మంగళగిరి టికెట్ ఆశించి భంగపడిన ఆమె, ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2024లో వైసీపీనుంచి కూడా ఆమెకు టికెట్ దక్కే అవకాశాలు లేవని తేలిపోయింది. ఆ స్థానానికి వైసీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు గంజి చిరంజీవి పోటీ పడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీలో ఉన్నా టికెట్ దక్కదనే ఉద్దేశంతో కాండ్రు కమల జనసేనలోకి వస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తమ్మీద జనసేన ఆవిర్భావ సభలో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరబోతుండటం విశేషం. ఆ ముగ్గురు కూడా రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నారు. జనసేనకు ఇది అదనపు బలమనే చెప్పాలి. ఆ ముగ్గురికి వచ్చే ఎన్నికల్లో టికెట్ పై హామీ లభించినట్టేనా, లేదా పొత్తుల కారణంగా మరోసారి వారు చిత్తవుతారా.. వేచి చూడాలి.