ఈ ఐదు స్థానాలే వైసీపీకి కీలకమా?
ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో గెలుచుకోవాల్సిన 2 స్థానాలు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లోని మూడు స్థానాల్లో గెలవటమే వైసీపీకి చాలా కీలకం.
వివిధ క్యాటగిరీల్లోని 13 శాసన మండలి స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 16వ తేదీన విడుదలవుతుంది. మార్చి 13న ఎన్నికలు నిర్వహించి 16వ తేదీన ఫలితాలు డిక్లేర్ చేస్తారు. అందరు అనుకుంటున్నట్లు అన్నీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ 13 స్థానాల్లో 8 సీట్లు స్థానిక సంస్థల కోటాలో భర్తీ అవబోతున్నాయి. 2 ఉపాధ్యాయుల కోటాలోను మిగిలిన మూడు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల కోటాలో భర్తీ కావాల్సుంది.
స్థానిక సంస్థల కోటాలో భర్తీ అవ్వాల్సిన 8 స్థానాలను వైసీపీనే గెలుచుకోవటం ఖాయం. స్థానిక సంస్థల్లో 95 శాతం వైసీపీ స్వీప్ చేసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తే వాళ్ళు ఎమ్మెల్సీలు అయిపోయినట్లే లెక్క. ఇదే సమయంలో ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో గెలుచుకోవాల్సిన 2 స్థానాలు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లోని మూడు స్థానాల్లో గెలవటమే వైసీపీకి చాలా కీలకమైంది.
ఎందుకు కీలకమంటే ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓటర్లు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లోని ఓటర్లు అచ్చంగా చదువుకున్నవాళ్ళే అయ్యుంటారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఉద్యోగాల భర్తీ చేయలేదని, ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారంటు ఎల్లో మీడియా ఒకటే ఊదరగొట్టేస్తోంది. ఇక ఉపాధ్యాయ లోకమంతా జగన్ అంటే కోపంతో రగిలిపోతున్నారంటు వార్తలు, కథనాలను ఇప్పటికీ వండి వారుస్తుంది.
ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఆరోపణలు, విమర్శలు వాస్తవమే అయితే పై రెండు కోటాల్లోని ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీ ఓడిపోవాలి. జరగబోయే ఎన్నికలు మొత్తం 13 ఉమ్మడి జిల్లాలను రెప్రజెంట్ చేస్తుంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల్లోని ఓటర్లు ఓట్లేయాలి. అలాగే గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలంటే ప్రకాశం-చిత్తూరు-నెల్లూరు, కడప-కర్నూలు-అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాల్లోని ఓటర్లు పాల్గొంటారు. పై జిల్లాల్లోని గ్రాడ్యయేట్లు, ఉద్యోగులు, టీచర్లు వేసే ఓట్లు జనాల నాడిని పసిగట్టేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి, ఎమ్మెల్సీ ఎన్నికలను సాధారణ ఎన్నికలకు కర్టెన్ రైజర్ అని అనుకోవచ్చా?