పోలవరంపై తీపి కబురు.. హోదాపై షర్మిలకు జగన్ రిప్లై ఇదే..
తెలంగాణకు 2014 జూన్ నుంచి మూడేళ్ల పాటు ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలియజేస్తూ ఆ బకాయిలను తెలంగాణ వెంటనే చెల్లించేలా చూడాలని కూడా జగన్ కోరారు.

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తీపి కబురు చెప్పింది. అలాగే, ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ఆచరణాత్మక సమాధానం ఇచ్చారు. వైఎస్ జగన్ హస్తిన పర్యటనలో ప్రధానంగా సాధించిన విజయాలు ఈ రెండు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. పోలవరం తొలి దశను సత్వరమే పూర్తి చేయడానికి రూ.12,911 కోట్ల నిధులను విడుదల చేయడానికి అంగీకరించింది.
అయితే పోలవరం మొదటి విడత నిర్మాణం పూర్తి చేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు అవసరమవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన జలశక్తి శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పుతూ వెంటనే పరిశీలించి ఆమోదం తెలియజేయాలని జగన్ కోరారు.
తెలంగాణకు 2014 జూన్ నుంచి మూడేళ్ల పాటు ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలియజేస్తూ ఆ బకాయిలను తెలంగాణ వెంటనే చెల్లించేలా చూడాలని కూడా జగన్ కోరారు.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీతో పాటు ఇతర హామీలను కూడా అమలు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా దానివల్ల మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని జగన్ చెప్పారు. దీనివల్ల ప్రత్యేక హోదా సాధనను జగన్ వదిలేయలేదని అర్థమవుతుంది. ప్రత్యేక హోదా విషయంలో షర్మిల జగన్‌పై చేస్తున్న విమర్శలో అర్థం లేదని తెలిసిపోతోంది.
విశాఖ నగరాన్ని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే విధంగా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల ఆరు లేన్ల రహదారికి తగిన సహాయసహకారాలు అందించాలని జగన్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలియజేయాలని కూడా ఆయన కోరారు.
విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం - కర్నూలు హైస్పీడ్ కారిడార్‌ను కడప మీదుగా బెంగళూరు వరకు పొడగించాలని ఆయన కోరారు. కడప-పులివెందుల-ముదిగుబ్బ- సత్యసాయి ప్రశాంత నిలయం ` హిందూపూర్ కొత్త రైల్వే లైన్‌ను అందులో భాగంగా చేపట్టాలని కూడా ఆయన కోరారు. దాని వల్ల వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి మంచి కనెక్టివిటీ ఏర్పడుతుందని ఆయన చెప్పారు.