Telugu Global
Andhra Pradesh

బోనులో మూడో చిరుత.. ఆపరేషన్ సక్సెస్

గతంలో ఓ బాలుడిపై దాడి చేసిన చిరుతను బంధించి తిరిగి అడవిలోనే వదిలిపెట్టారు అధికారులు. దాంతో కలిపితే మొత్తం 4 చిరుతలు బోనులో చిక్కాయి. ప్రస్తుతం బందీ అయిన చిరుతను కూడా తిరుపతి జూ పార్క్ కి తరలిస్తారు.

బోనులో మూడో చిరుత.. ఆపరేషన్ సక్సెస్
X

శేషాచలం కొండల్లో చేపట్టిన ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది. మూడో చిరుత కూడా బోనులో బందీ అయింది. వారం రోజులుగా ఈ చిరుత కోసం అటవీ అధికారులు గాలిస్తున్నారు. బోను వద్దకు వచ్చినట్టే వచ్చి తప్పించుకుపోతోంది ఈ చిరుత. సీసీ కెమెరాలకు చిక్కుతున్నా, అది బోను వద్దకు రావడంలేదు. అయితే రాత్రి ఏడోమైలు వద్ద ఎట్టకేలకు ఇది బోనులో చిక్కింది. దీంతో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయిందని అంటున్నారు అధికారులు.

మొత్తం 4 చిరుతలు..

గతంలో ఓ బాలుడిపై దాడి చేసిన చిరుతను బంధించి తిరిగి అడవిలోనే వదిలిపెట్టారు అధికారులు. దాంతో కలిపితే మొత్తం 4 చిరుతలు బోనులో చిక్కాయి. ప్రస్తుతం బందీ అయిన చిరుతను కూడా తిరుపతి జూ పార్క్ కి తరలిస్తారు. అంటే మొత్తం జూలో 3 చిరుతలు ఉంటాయి. అడవిలో వదిలిపెట్టిన చిరుత జాడ ఇప్పటి వరకు కనపడకపోవడంతో అది దట్టమైన లోపలి ప్రాంతాల్లోకి వెళ్లి ఉంటుందని అంచనా వేస్తున్నారకు. తిరుమల కాలినడక మార్గం, ఘాట్ రోడ్డుకి సమీపంలో సంచరిస్తున్న మూడు చిరుతలను ఎట్టకేలకు బంధించారు అధికారులు.

ఆపరేషన్ ముగిసినట్టేనా..?

మెట్ల మార్గంలో ప్రస్తుతానికి భక్తుల్లో భయాందోళన తొలగినట్టే. అయితే అదే సమయంలో మరిన్ని చిరుతలు అటువైపుగా వస్తే పరిస్థితి ఏంటనేది తేలడంలేదు. ఇటీవల ఎలుగుబంట్లు కూడా మెట్ల మార్గంలో సంచరిస్తున్నాయి. వాటి సంగతేంటి..? అనేది తేలాల్సి ఉంది. మూడు చిరుతల్ని పట్టుకున్నందుకు సంబరపడకుండా.. భద్రతపై మరింత ఫోకస్ పెడితే మంచిది అని అంటున్నారు సామాన్య భక్తులు.


First Published:  28 Aug 2023 7:42 AM IST
Next Story