సీఎం జగన్ టార్గెట్ వాళ్లే.. ఆ పథకాలే ఓట్లు తెచ్చిపెడతాయని భరోసా
వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ప్రతీ పథకం మహిళలను టార్గెట్ చేసుకునే అమలు చేశారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మహిళలను ప్రతీ పథకంలో భాగస్వామ్యం చేశారు. ఇంటిలో మగవాళ్ల కంటే.. మహిళలను నమ్ముకుంటే ఓట్లు కచ్చితంగా పడతాయనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. మూడు రాజధానులపై సుప్రీంను ఆశ్రయించడం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తండ్రి వైఎస్ఆర్ పేరు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూనివర్సిటీ పేరు విషయాన్ని ప్రతిపక్ష టీడీపీ చాలా సీనియర్‌గా తీసుకున్నది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ, సీఎం జగన్‌పై ఘాటైన విమర్శలు గుప్పించింది. మూడేళ్ల పాటు ప్రజారంజక పాలన అందించిన వైఎస్ జగన్.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. వైసీపీలో కూడా జగన్ నిర్ణయాల పట్లు కాస్త వ్యతిరేకత వస్తోంది. అయితే వైఎస్ జగన్ మాత్రం తన లెక్కలు తనకు ఉంటాయని భావిస్తున్నారు. ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చిన జగన్.. అంత త్వరగా దాన్ని వదులుకునేందుకు సిద్దంగా లేరు. తనకు ఓట్లు తెచ్చి పెట్టే వాళ్లను వదులుకునేది లేదని మరోసారి కుప్పం సభ ద్వారా స్పష్టం చేసేశారు.
వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ప్రతీ పథకం మహిళలను టార్గెట్ చేసుకునే అమలు చేశారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మహిళలను ప్రతీ పథకంలో భాగస్వామ్యం చేశారు. ఇంటిలో మగవాళ్ల కంటే.. మహిళలను నమ్ముకుంటే ఓట్లు కచ్చితంగా పడతాయనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే పలు పథకాల ద్వారా మహిళల ఖాతాల్లోకే నేరుగా నగదు జమ చేస్తున్నారు. గత మూడేళ్లలో మహిళల కోసం పలు పథకాల ద్వారా రూ. 1,17,667 కోట్లు పంపిణీ చేశారు. ఈ ఒక్క ఫిగర్ చాలు.. జగన్ మహిళలను ఎంతలా నమ్ముతున్నారో అని చెప్పడానికి. మహిళలకు ఇచ్చిన సొమ్ములు వృథాగా పోవట్లేదని రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి నిన్న కుప్పం సభలో కొందరు మహిళలతో మాట్లాడించారు. కూలీగా ఉన్న మహిళ చిన్న పాటి వ్యాపారం మొదలు పెట్టి కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చిన విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశం అయ్యింది. మరోవైపు పెన్షన్లను రూ. 2,750కి పెంచుతామని కూడా జగన్ మాటిచ్చారు. కేవలం గేదెలు, ఆవులు కొనుక్కోవడమే కాకుండా.. కిరాణా షాపులు పెట్టుకోవడానికి మహిళలు జగన్ పథకాలను ఉపయోగించుకుంటున్నారు.
గతంలో లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేవాళ్లు. అప్పు తిరిగి చెల్లించమనే బ్యాంకు అధికారుల వేధింపులూ ఉండేవి. వీటన్నింటినీ మార్చేసి నేరుగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుండటం కచ్చితంగా జగన్‌కు ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. పేర్ల మార్పిడి వంటి అంశాలు ప్రతిపక్షం రచ్చ చేస్తున్నా.. రేపు మరో వార్త వస్తే ప్రజలు దాన్ని మర్చిపోతారు. కానీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన వాళ్లు తప్పకుండా గుర్తుంచుకుంటారు. మగవాళ్లకు వేసిన డబ్బుల కంటే మహిళల ఖాతాల్లో వేసిన డబ్బులు కుటుంబం మొత్తానికి ఉపయోగపడుతున్నాయని సీఎం జగన్ విశ్వసిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్ని భావోద్వేగాలు ఉన్నా.. చివరకు పథకాలు తనకు శ్రీరామరక్షగా భావిస్తున్నారు. ఒక మహిళ అయితే కుటుంబం మొత్తంతో ఓట్లేయించగలదని కూడా అంచనా వేస్తున్నారు. మహిళల ఓటు బ్యాంకు పెంచుకుంటే భవిష్యత్‌లో ఎలాంటి ఢోకా ఉండదని అనుకుంటున్నారు. అందుకే వారి విషయంలో ప్రతీ నిర్ణయాన్ని ఆచి తూచి తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.