Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు దొంగాటలు ఇవేనా..?

వైసీపీలోని అసంతృప్తులు ఎప్పుడెప్పుడు టీడీపీలో చేరుతారా అని ఒకవైపు ఎదురుచూస్తూ, మరోవైపు ఆయారాం గయారాంలను పట్టించుకునేది లేదని చెప్పటం చంద్రబాబుకే చెల్లింది.

చంద్రబాబు దొంగాటలు ఇవేనా..?
X

అమలాపురం సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఎవరికైనా ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే.. చంద్రబాబు చెప్పేమాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతనుండదు కాబట్టే. ఇంతకీ విషయం ఏమిటంటే.. అమలాపురంలో ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆయారాం గయారాంలను పట్టించుకునేది లేదని చాలా గంభీరంగా ప్రకటించారు. కొత్తవాళ్ళు ఎవరైనా చంద్రబాబు మాటలువింటే వైసీపీ అసంతృప్తులకు దారేది అని అనుకుంటారు.

అయితే చాలా ఓపికగా గమనిస్తే చంద్రబాబు ప్రకటనలోని డొల్లతనం బయటపడుతుంది. ఆయారాం గయారాం లను పట్టించుకునేది లేదని అంటే అర్థ‌మేంటి..? ఎన్నికలకు ముందు టికెట్లను మాత్రమే ఆశించి పార్టీలో చేరుతున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చేది లేదనే కదా అర్థం. కానీ, చంద్రబాబు చేస్తున్నది ఏమిటి..? వైసీపీలో అసంతృప్తులకు గాలమేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేల‌కు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరిస్తున్నారు. మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేల‌ నియోజకవర్గాలను మారుస్తున్నారు.

టికెట్లు దక్కని వాళ్ళు జగన్ పైన బాగా అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు. సహజంగానే టీడీపీ వైపు చూస్తున్నారు. వీరిలో కొందరితో టీడీపీ సీనియర్లు టచ్ లోకి వెళుతున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి లాంటి వాళ్ళతో సీనియర్ తమ్ముళ్ళు భేటీ అవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీలో చేర్చుకునే ఉద్దేశ్యంలేనప్పుడు మరి తమ్ముళ్ళు ఎందుకు భేటీ అవుతున్నారు. నారా లోకేష్ తో విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఎందుకు భేటీ అయ్యారో చంద్రబాబు చెప్పగలరా..? చంద్రబాబు అంగీకారం లేకుండానే ఇదంతా జరుగుతోందా..?

వైసీపీలోని అసంతృప్తులు ఎప్పుడెప్పుడు టీడీపీలో చేరుతారా అని ఒకవైపు ఎదురుచూస్తూ, మరోవైపు ఆయారాం గయారాంలను పట్టించుకునేది లేదని చెప్పటం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబు చెప్పేదానికి చేసేదానికి అసలు పొంతనే ఉండదని జనాల్లో ముద్రపడిపోయింది. అందుకనే చంద్రబాబును జనాలెవరూ నమ్మరు. కాకపోతే చంద్రబాబు రాజకీయమంతా కేవలం అదృష్టాన్ని నమ్ముకునే చేస్తుంటారు కాబట్టి చెల్లిపోతోంది. 2019లో తిరగబడిన అదృష్టం 2024లో ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది.

First Published:  21 Jan 2024 10:31 AM IST
Next Story