Telugu Global
Andhra Pradesh

టీడీపీ @ 100...టెన్షన్ పెరిగిపోతోందా..?

ఇన్ని సీట్లను మిత్రపక్షాలకు కేటాయిస్తే టీడీపీ పోటీచేయబోయే సీట్లు 100 మాత్రమే. ఇన్ని తక్కువ సీట్లకు టీడీపీ పోటీచేయటం చరిత్రలోనే ఎప్పుడూ జరిగుండదు.

టీడీపీ @ 100...టెన్షన్ పెరిగిపోతోందా..?
X

జరుగుతున్న ప్రచారం నిజమే అయితే తెలుగుదేశం పార్టీకి ఇంతకు మించిన అవమానం మరోటుండదు. ఇంతకీ విషయం ఏమిటంటే.. రాబోయే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోనిదే పోటీచేసేంత సీన్ తెలుగుదేశం పార్టీకి లేదని ఎప్పుడో తేలిపోయింది. అందుకనే ముందుగా జనసేనతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబునాయుడు తర్వాత బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. దాదాపు ఐదేళ్ళ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించేట్లున్నాయి. అయితే ఒకవైపు పొత్తులు ఫలించే సంకేతాలున్నా ఆ పొత్తుల ద్వారా కోల్పోయే సీట్ల సంఖ్యే చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళల్లో టెన్షన్ పెంచేస్తోందట.

ఆ ప్రచారం ఏమిటంటే.. పొత్తులో భాగంగా జ‌న‌సేన‌, బీజేపీలు 75 సీట్లు అడిగాయట. పొత్తులు ఖాయమవ్వాలంటే జనసేనకు 50 సీట్లు, బీజేపీకి 25 అసెంబ్లీలను వదులుకోవాల్సిందే. జనసేనతో సీట్ల సర్దుబాటులో 20 లేదా 25 ఇచ్చి ముగించేయాలని చంద్రబాబు అనుకున్నారు. ఎప్పుడైతే బీజేపీ ఎంటరయ్యిందో అప్పటినుండే సీన్ మొత్తం రివర్సయ్యిందట. తాము పోటీచేసే స్థానాలతో పాటు జనసేనకు ఇవ్వాల్సిన సీట్లను కూడా బీజేపీనే అడుగుతోందట. అలాగే రెండుపార్టీలకు కలిసి 12 ఎంపీ సీట్లను కూడా అడిగిందట.

దాంతో ఇప్పుడు ఏమిచేయాలో చంద్రబాబుకు దిక్కుతోచటంలేదని సమాచారం. ఇన్ని సీట్లను మిత్రపక్షాలకు కేటాయిస్తే టీడీపీ పోటీచేయబోయే సీట్లు 100 మాత్రమే. ఇన్ని తక్కువ సీట్లకు టీడీపీ పోటీచేయటం చరిత్రలోనే ఎప్పుడూ జరిగుండదు. పొత్తుల్లో మిత్రపక్షాలు ఎన్నిసీట్లకు పోటీచేయాలన్న విషయాన్ని ఎప్పుడూ చంద్రబాబే డిసైడ్ చేసేవారు. మిత్రపక్షాలు పోటీచేయబోయే సీట్ల సంఖ్య డిసైడ్ చేసే అవకాశం మొదటిసారి చంద్రబాబు నుండి జారిపోయినట్లుంది. చంద్రబాబు అవసరాన్ని బీజేపీ బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్లుంది. దీనివల్ల సుమారు 30 మంది సీనియర్ తమ్ముళ్ళ రాజకీయానికి కూడా తలుపులు మూసుకుపోతాయేమో.

ఇదే నిజమైతే ప్రతిజిల్లాలోనూ చాలామంది సీనియర్ తమ్ముళ్ళకు పోటీచేసే అవకాశం పోయినట్లే. అసలే ఈ ఎన్నికలు టీడీపీతో పాటు చంద్రబాబుకు జీవన్మరణ సమస్యలాంటిది. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ మెల్లిగా కనుమరుగైపోతుంది. చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుతో పాటు లోకేష్ కు కూడా కష్టాలు తప్పవు. గెలిస్తే పార్టీకి ఊపిరి వచ్చినట్లవుతుంది. అలాగే లోకేష్ భవిష్యత్తుకు గట్టి పునాదులు పడతాయి. అందుకనే రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు చంద్రబాబుకు అంత అవసరం. ఇలాంటి నేపథ్యంలో సీట్ల సర్దుబాటు తన చేతిలో లేకుండా పోవటమే టెన్షన్ పెంచేస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.

First Published:  15 Feb 2024 11:11 AM IST
Next Story