Telugu Global
Andhra Pradesh

ఇదే నిజమైతే పవన్ పనైపోయినట్లేనా..?

ఎల్లోమీడియా వార్తలు నిజమే అయితే పవన్‌కు ఇబ్బందులు తప్పవ‌నే అనిపిస్తోంది. ఎలాగంటే.. పవన్ 50 అసెంబ్లీ సీట్లతో పాటు 8 పార్లమెంటు నియోజకవర్గాలను అడిగారట. ఈ మేరకు ఒక జాబితాను కూడా చంద్రబాబుకు అందించినట్లు చెప్పింది.

ఇదే నిజమైతే పవన్ పనైపోయినట్లేనా..?
X

తెలుగుదేశం, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పొత్తులో పోటీచేయాల్సిన సీట్ల సంఖ్య, నియోజకవర్గాలు, ఉమ్మడి మేనిఫెస్టో, నియోజకవర్గాల్లో అమలు చేయాల్సిన ఉమ్మడి కార్యాచరణ తదితరాలపై చర్చించేందుకు దాదాపు మూడున్నర గంటలపాటు భేటీఅయ్యారు. ఉమ్మడి మేనిఫెస్టో, కార్యాచరణ తదితరాలపై స్థూలంగా నిర్ణయానికి వచ్చినా.. అసలైన సీట్ల విషయం మాత్రం ఫైనల్ కాలేదని సమాచారం. సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై చర్చలు జరిపినా ఏకాభిప్రాయానికి అధినేతలు రాలేకపోయారట.

ఎల్లోమీడియా వార్తలు నిజమే అయితే పవన్‌కు ఇబ్బందులు తప్పవ‌నే అనిపిస్తోంది. ఎలాగంటే.. పవన్ 50 అసెంబ్లీ సీట్లతో పాటు 8 పార్లమెంటు నియోజకవర్గాలను అడిగారట. ఈ మేరకు ఒక జాబితాను కూడా చంద్రబాబుకు అందించినట్లు చెప్పింది. అయితే ఈ విషయమై చంద్రబాబు నుండి సానుకూల స్పందన రాలేదని సమాచారం. 25 అసెంబ్లీలు 2 లేదా 3 లోక్ సభ సీట్లు ఇవ్వటానికి చంద్రబాబు రెడీ అయినట్లు ఎల్లోమీడియా చెప్పింది. ఎల్లోమీడియా చెప్పిందంటే దాదాపు నిజమే అయ్యుంటుందనే ప్రచారం మొదలైంది.

ఇదే నిజమైతే పవన్ చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సుంటుంది. ఎందుకంటే.. జనసేన నేతలేమో 50-60 అసెంబ్లీలు, 8 లోక్ సభ సీట్లలో పోటీచేయాలని పట్టుబడుతున్నారు. పవన్ మద్దతుదారుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కూడా జనసేన 50-60 అసెంబ్లీ సీట్లలో పోటీచేయకపోతే కాపు సామాజికవర్గం మద్దతు కష్టమే అన్నారు. పైగా ముఖ్యమంత్రిగా రెండున్నర సంవత్సరాలు పవన్ ఉండేట్లు మేనిఫెస్టోలో స్పష్టంగా ఉండాలని అంటున్నారు.

ముఖ్యమంత్రిగా పవన్‌కు హామీ, 50-60 అసెంబ్లీ సీట్లు తీసుకోకపోతే కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ అవటం కష్టమని జోగయ్య ఒక లేఖలో పవన్‌కు స్పష్టంచేశారు. జోగయ్య, జనసేన నేతలు అడుగుతున్నట్లు కాకుండా చంద్రబాబు చెప్పినట్లు 25 అసెంబ్లీ సీట్లకు పవన్ అంగీకరిస్తే కష్టమే అంటున్నారు. గతంలో పవనే చెప్పినట్లు 25 అసెంబ్లీ సీట్లలో పోటీచేయటం జనసేనకు గౌరవప్రదం కాదు. సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై ఏకాభిప్రాయం కుదరని కారణంగానే భేటీ వాయిదాపడినట్లు జనసేన వర్గాలు చెప్పాయి. నియోజకవర్గాల సంఖ్య 25 అయితే ఎన్నిసార్లు భేటీలు జరిగినా ఉపయోగం ఏముంటుందో పవన్ ఆలోచించుకోవాలి..?

First Published:  14 Jan 2024 11:21 AM IST
Next Story