అభ్యర్థుల ‘ముందస్తు’ ప్రకటనకు నిర్ణయించారా?
రాబోయే జూన్‌లో కనీసం 90 మంది అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు ప్రచారం మొదలైంది. పార్టీ వర్గాల ప్రకారం 60 మంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉంది. ఇంతమందికి కాకపోయినా కనీసం 40 మందికి టికెట్లు దక్కే అవకాశం లేదని చర్చ జరుగుతోంది.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారా? పార్టీ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఈ మధ్య జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ముందస్తు ఎన్నికలు అవసరంలేదని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు జగన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే దాన్ని చాలామంది నమ్మటంలేదు. ఎందుకంటే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, జోరు చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనతోనే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది.
ఇందులో భాగంగానే రాబోయే జూన్ నెలలో కనీసం 90 మంది అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు ప్రచారం మొదలైంది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను వీలైనంత తొందరగా ప్రకటిచేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారట. పార్టీ వర్గాల ప్రకారం 60 మంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉంది. ఇంతమందికి కాకపోయినా కనీసం 40 మందికి టికెట్లు దక్కే అవకాశం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది.
కొత్తవారిని పోటీకి దింపిన చోట్ల పార్టీలో వ్యతిరేకతను సర్దుబాటు చేసుకునేందుకు అభ్యర్థులకు తగినంత సమయం ఉంటుంది. అలాగే ప్రతిపక్షాలను ఇరుకునపెట్టేయచ్చు. వైసీపీ అభ్యర్థులను ప్రకటించేస్తే అది ప్రతిపక్షాలపై మానసికంగా ఒత్తిడి పెంచేసే అవకాశముంది. వీటన్నింటినీ పక్కనపెట్టేస్తే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళితే పెద్ద సమస్య వస్తుందట. అదేమిటంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంక్షేమ పథకాల అమలుకు నిధులను సమకూర్చుకోవటం కష్టమైపోతుంది. ఎన్నికల సంవత్సరం కాబట్టి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఏ మేరకు సహకరిస్తారో తెలీదు.
ఇదే సమయంలో కేంద్ర సహకారం కూడా అనుమానమే. మే నెలంటే ఎండలు మండిపోతాయి. నీటికొరత చాలా ఇబ్బందులు పెడుతుంటుంది. అదే డిసెంబర్ అంటే చలికాలం కాబట్టి ఎన్నికల ప్రక్రియను హ్యాపీగా చేసుకోవచ్చు. ఆ మధ్య గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రూపొందించిన జగన్ ఇప్పుడు జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది చూడటానికి పార్టీ కార్యక్రమంగానే కనబడినా నిజానికి ఎన్నికల ప్రచారమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ముందస్తు ఎన్నికలపై జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. మరి ఫలితాలు ఆశించినట్లుగా ఉంటుందా ?