Telugu Global
Andhra Pradesh

పవన్ ఆశ తీరుతుందా?

గన్నవరంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పటు కీలక నేతలంతా పాల్గొంటున్నారు. మామూలుగా అయితే ఈ సమావేశానికి పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు. కానీ పొత్తుల‌పై కూడా చర్చలు జరిగే అవకాశముందని సమాచారం.

పవన్ ఆశ తీరుతుందా?
X

జనసేన ఆశని మిత్రపక్షం బీజేపీ తీరుస్తుందా ? ఇప్పుడీ విషయమే చాలా ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే శుక్రవారం గన్నవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పటు కీలక నేతలంతా పాల్గొంటున్నారు. వీళ్ళే కాకుండా జాతీయ పార్టీ నుండి రాష్ట్ర ఇన్‌చార్జిలు మురళీధరన్, సునీల్ దేవధర్ లాంటివాళ్ళు కూడా వస్తున్నారు. మామూలుగా అయితే ఈ సమావేశానికి పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు. కానీ అనేక అంశాలతో పాటు పొత్తు విషయంపైన కూడా చర్చలు జరిగే అవకాశముందని సమాచారం.

ఎప్పుడైతే పొత్తులపై చర్చలన్నారో సమావేశానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పొత్తుపై తాను ప్రకటించటమే కాకుండా టీడీపీతో మిత్రపక్షం బీజేపీ కూడా పెట్టుకుంటుందని ప్రకటించటమే సమస్యగా మారింది. తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ప్రకటించటానికి పవన్ ఎవరంటు బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

సమస్య ఎక్కడ వచ్చిందంటే బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే పవన్ రెగ్యులర్‌గా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్నారు. తాను భేటీ అవటమే కాకుండా బీజేపీని కూడా లాగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుతో పొత్తు విషయంలో బీజేపీ నేతల్లో స్పష్టమైన విభజన వచ్చేసింది. కొందరు నేతలేమో టీడీపీతో పొత్తు వద్దే వద్దంటున్నారు. మరికొందరేమో చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారు.

బీజేపీ, టీడీపీ పొత్తు కుదిరితే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటానికి కొందరు నేతలు రెడీగా ఉన్నారు. ఒకవేళ పొత్తు లేకపోతే పోటీకి దూరంగా ఉంటారు. ఇలాంటి నేతలంతా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని పార్టీ నాయకత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జరగబోతున్న కార్యవర్గ సమావేశం కాబట్టి ప్రాధాన్యత వచ్చింది. నిజానికి పొత్తుల విషయం తేలేది నరేంద్ర మోడీ దగ్గరే కానీ రాష్ట్రంలో కాదు. మోడీకేమో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలనే ఉద్దేశం లేదు. చంద్రబాబుతో పొత్తు వద్దంటే బీజేపీతో కటీఫ్ చెప్పి టీడీపీతో చేరిపోవటం ఖాయం. అందుకనే కమలనాథుల్లో అయోమయం పెరిగిపోతోంది. చివరకు పొత్తు అంశం ఏమవుతుందో చూడాలి.

First Published:  19 May 2023 5:03 AM GMT
Next Story