వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయి : సీఎం చంద్రబాబు
వాచ్‌మెన్ రంగన్న మృతి ముమ్మాటికీ అనుమానాస్పదమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

మాజీ మంత్రి వివేక హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న మృతి పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినేట్ భేటీ అనంతరం వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్న మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. వివేకా హత్యకేసు సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్న అంశంపై దాదాపు గంటపాటు చర్చ జరిగింది. రంగన్నను పోలీసులే చంపారంటూ తొలుత వార్తలు రావడంపై మంత్రివర్గంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి.‘‘ఏ దురుద్దేశం లేకపోతే రంగన్న మృతిని పోలీసులకు ఎందుకు ఆపాదిస్తారు. రంగన్న మృతిని ప్రభుత్వానికి ఆపాదించాలనే కుట్ర ఉంది’’ అని కొందరు మంత్రులు వ్యాఖ్యానించినట్టు సమాచారం. రంగన్న ఊపిరితిత్తుల వ్యాధితో మరణించాడని ఆయన భార్య చెబుతున్నప్పటికీ, పలు వైపుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో పరిటాల రవి హత్య కేసులోనూ సాక్షులు ఇదే విధంగా మరణిస్తూ వచ్చారని... ఇప్పుడు వివేకా హత్య కేసులో అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కాగా, వివేకా హత్య జరిగినప్పుడు జగన్, వైఎస్ భారతిలను కారులో హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడన్న విషయం, వివేకా హత్య గురించి కారులో జగన్, భారతి మాట్లాడుకున్న మాటలను ఆ డ్రైవర్ విన్నాడని, ఆ తర్వాత అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ గతంలో జరిగిన ప్రచారంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. వివేకా వ్యవహారానికి సంబంధించి ఇప్పటిదాకా ఏడుగురు మరణించారని కూడా చర్చ జరిగింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాను అనేకసార్లు చెబుతున్నానని గుర్తుచేశారు.