Telugu Global
Andhra Pradesh

యనమల-జ్యోతుల మధ్య బిగ్ ఫైట్ నడుస్తోందా?

జ్యోతులకు వ్యతిరేకంగా యనమల, యనమలను దెబ్బకొట్టేందుకు జ్యోతుల పావులు కదుపుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో మిగిలిన నేతలు నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవ‌ల‌ ప్రత్తిపాడులో వరపుల రాజా చనిపోవ‌డంతో అక్క‌డ‌ తాము చెప్పిన నేతకే టికెట్ ఇవ్వాలని ఇటు యనమల అటు జ్యోతుల బాగా పట్టుబడుతున్నట్లు టాక్.

యనమల-జ్యోతుల మధ్య బిగ్ ఫైట్ నడుస్తోందా?
X

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై జగ్గంపేట సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ మండిపోతున్నారట. కారణం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంలో తేడా జరుగుతోందని అనుమానం రావటమే అని సమాచారం. విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయాలని జ్యోతుల నవీన్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదే సమయంలో జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి జ్యోతుల నెహ్రూ రెడీ అవుతున్నారు. నెహ్రూ కొడుకే నవీన్ అన్న విషయం తెలిసిందే.

ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకులకు టికెట్లు ఇవ్వకూడదని గతంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే తప్పని పరిస్థితుల్లో ఎక్కడైనా ఇస్తే ఇవ్వవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తండ్రి, కొడుకులకు పార్టీలో బాగా వ్యతిరేకత పెరిగిపోతోందట. తండ్రి, కొడుకుల్లో ఎవరో ఒకళ్ళకు మాత్రమే టికెట్ ఇవ్వాలని కొందరు సీనియ‌ర్ నేత‌లు చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నారట. వీళ్ళెందుకు చెబుతున్నారంటే వెనకాల మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉన్నారని సమాచారం.

యనమలకు జ్యోతులకు దశాబ్దాల వైరముంది. వీళ్ళద్దరికీ ఏమాత్రం పడదు. అందుకనే జ్యోతుల ఫ్యామిలీని దెబ్బకొట్టేందుకు యనమల పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని తన మద్దతుదరులను చంద్రబాబు మీదకు యనమల ఉసుకొల్పుతున్నారనే ఆరోపణలున్నాయి. దాంతో అలర్టయిన జ్యోతుల తునిలో యనమల కూతురు దివ్యకు టికెట్ ఇవ్వకూడదని తన మద్దతుదారులతో చంద్రబాబుకు చెప్పిస్తున్నారట. అలాగే పిఠాపురం, ప్రత్తిపాడులో తాను చెప్పిన వాళ్ళకి టికెట్లిస్తే గెలుపు ఖాయమని చంద్రబాబుకు జ్యోతుల పదేపదే చెబుతున్నారట.

అంటే జ్యోతులకు వ్యతిరేకంగా యనమల, యనమలను దెబ్బకొట్టేందుకు జ్యోతుల పావులు కదుపుతున్నట్లు అర్థ‌మవుతోంది. వీళ్ళిద్దరి మధ్యలో మిగిలిన నేతలు నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవ‌ల‌ ప్రత్తిపాడులో వరపుల రాజా చనిపోయారు. దాంతో ఇక్కడ తాము చెప్పిన నేతకే టికెట్ ఇవ్వాలని ఇటు యనమల అటు జ్యోతుల బాగా పట్టుబడుతున్నట్లు టాక్. మొత్తానికి పార్టీలోని రెండు పెద్ద తలకాయల మధ్య జరుగుతున్న వివాదం కారణంగా మధ్యలో చాలామంది నలిగిపోతున్నారు. చివరకు చంద్రబాబు ఏమి చేస్తారో చూడాల్సిందే.

First Published:  2 April 2023 6:28 AM GMT
Next Story