నూతన పరకామణిలో బోణీ..
జియ్యంగార్ల మఠం గుమస్తా తనిఖీల కోసం పరకామణి భవనానికి వెళ్లాడు. అయితే అక్కడ కక్కుర్తి పడ్డాడు. విదేశీ కరెన్సీని కొట్టేయాలని చూశాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి-5న తిరుమలలో నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించారు. హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని అక్కడే టీటీడీ సిబ్బంది లెక్కిస్తారు. అత్యాధునిక భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, నూతన టెక్నాలజీతో నిరంతర నిఘా ఈ భవనంలో ఉంది. కానీ ప్రారంభమైన మూడు నెలల్లోపే పరకామణిలో బోణీ కొట్టారు. విదేశీ కరెన్సీని దొంగిలిస్తూ గుమస్తా పట్టుబడ్డాడు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, గుమస్తాను అదుపులోకి తీసుకున్నారు.
కంచే చేను మేసింది..
పరకామణిలో హుండీ సొమ్ము లెక్కింపు జరిగే సమయంలో జియ్యంగార్ల మఠం నుంచి ఓ గుమస్తా పర్యవేక్షణకు వెళ్లడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ప్రకారమే.. ఈరోజు కూడా జియ్యంగార్ల మఠం గుమస్తా తనిఖీల కోసం పరకామణి భవనానికి వెళ్లాడు. అయితే అక్కడ కక్కుర్తి పడ్డాడు. విదేశీ కరెన్సీని కొట్టేయాలని చూశాడు. మలద్వారం దగ్గర కొన్ని కరెన్సీ నోట్లు పెట్టుకుని బయటకు వచ్చే సమయంలో సీసీ కెమెరాలకు చిక్కాడు. విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేసి ఆ నోట్లు బయటకు తీశారు.
పరకామణిలో చోరీ జరిగింది అనేసరికి అందరూ కాంట్రాక్ట్ సిబ్బంది తప్పుచేశారేమో అనుకున్నారు. కానీ తనిఖీకి వచ్చిన జియ్యంగార్ల మఠం గుమస్తా ఈ దొంగతనం చేశాడనే సరికి అందరూ షాకయ్యారు. తనిఖీ చేసేవారే దొంగతనానికి పాల్పడటం సంచలనంగా మారింది. అయితే అధునాతన నిఘా వ్యవస్థ నుంచి గుమస్తా తప్పించుకోలేకపోయాడు, అడ్డంగా దొరికిపోయాడు.
తిరుమలలో అన్నదాన సత్రానికి సమీపంలో రూ. 8.9 కోట్ల ఖర్చుతో నూతన పరకామణి భవనం నిర్మించింది టీటీడీ. అత్యాధునిక సదుపాయాలు, నిఘా యంత్రాలు, సీసీ కెమెరాల నిర్వహణకోసం రూ.15 కోట్లు ఖర్చు చేశారు. పరకామణి భవనం నాలుగు వైపులా అద్దాలు ఏర్పాటు చేశారు. ఇంత నిఘా ఉన్నా కూడా గుమస్తా కక్కుర్తి పడి చివరకు విజిలెన్స్ సిబ్బందికి దొరికిపోయాడు. 72వేల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.