Telugu Global
Andhra Pradesh

రామోజీకి ఒక రూలు.. అవినాష్‌కు మరో రూలా?

మార్గదర్శి కేసులు కోర్టు విచారణలో ఉన్నప్పుడు సీఐడీ ఏడీజీ సంజయ్ మీడియాతో ఎలా మాట్లాడతారని ప‌లువురు టీడీపీ నేతలు లాపాయింట్ లేవదీశారు. మరిదే పాయింట్ అవినాష్‌రెడ్డికి ఎందుకు వర్తించదు?

రామోజీకి ఒక రూలు.. అవినాష్‌కు మరో రూలా?
X

రామోజీకి ఒక రూలు.. అవినాష్‌కు మరో రూలా?

మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, సంస్థ‌ ఎండీ శైలజ విషయంలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు విచిత్రంగా ఉంది. మార్గదర్శి చీటింగ్ కేసులు కోర్టు విచారణలో ఉన్నపుడు రామోజీ, శైలజ తప్పుచేశారని సీఐడీ ఎలా నిర్ధారిస్తుంది? సీఐడీ ఏడీజీ సంజయ్ మార్గదర్శి శాఖలను మూసేస్తామని చెప్పటం ఏమిటని తమ్ముళ్ళు రెచ్చిపోయారు. మార్గదర్శి శాఖలను మూసేయాలా వద్దా అన్న విషయం తేల్చాల్సింది కోర్టే కానీ సంజయ్ ఎవరంటూ నిలదీశారు. ఎల్లో మీడియాలో 10వ పేజీ మొత్తం మార్గదర్శికి మద్దతు, సంజయ్ వ్యతిరేక వార్తలతోనే నింపేశారు.

మార్గదర్శికి మద్దతుగా పలువురితో మాట్లాడించటం దాన్ని ప్రముఖంగా అచ్చేయటమనే ప్రక్రియను కొద్ది రోజులుగా రామోజీ నిరంతరం చేస్తున్నారు. మార్గదర్శికి ఎంత మందితో మద్దతుగా మాట్లాడించినా కోర్టు విచారణలో ఉపయోగపడదని రామోజీ మరచిపోయినట్లున్నారు. కోర్టు చూసేది సంస్థ‌ ఏర్పాటు, నిర్వహణ చట్టప్రకారం జరుగుతోందా? లేదా అని మాత్రమే. చందాదారుల సొమ్మును నిబంధనల ప్రకారమే ఉపయోగిస్తున్నారా లేదా? దారి మళ్ళించారా అని మాత్రమే.

సాంకేతిక విషయాలను వదిలిపెట్టేసి మార్గదర్శిలో రామోజీ, శైలజ ఎలాంటి తప్పులు చేయలేదని టీడీపీ నేతలు వర్ల రామయ్య, ధూళిపాళ్ళ నరేంద్ర, వంగలపూడి అనిత, వైసీసీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు తీర్పిచ్చేశారు. మార్గదర్శి కేసులు కోర్టు విచారణలో ఉన్నప్పుడు సంజయ్ మీడియాతో ఎలా మాట్లాడతారని లాపాయింట్ లేవదీశారు. మరిదే పాయింట్ అవినాష్‌రెడ్డికి ఎందుకు వర్తించదు?

వివేకానందరెడ్డి మర్డర్ కేసు కూడా కోర్టు విచారణలోనే ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డే సూత్రధారని, అవినాషే కీలక పాత్రధారని ఇదే ఎల్లో మీడియా, తమ్ముళ్ళు ఎన్నివందల సార్లు తీర్పులు చెప్పుంటారు. పైగా సీబీఐకి ప్యార‌ల‌ల్‌గా ఎల్లోమీడియా వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తోంది. సీఐడీ విచారణలో రామోజీ ఏమి మాట్లాడరనే విషయం బయటకు ఎలా లీకైందని తమ్ముళ్ళు అడగటమే విచిత్రంగా ఉంది. సీబీఐ విచారణలో అవినాష్ మాటలను డైలాగ్ బై డైలాగ్ ఎల్లో మీడియా ఎన్నిసార్లు అచ్చేయలేదు? ఒక‌ప్పుడు సీబీఐ విచారణలో జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పారనే విషయాలను కూడా పేజీలకు పేజీలు రన్నింగ్ కామెంట్రీలాగ ఎలా ప్రింట్ చేశారు? నీతులు చెప్పటానికేనా ఆచరణకు కాదా?

First Published:  22 Jun 2023 11:03 AM IST
Next Story