Telugu Global
Andhra Pradesh

వార్ ఓపెన్ అయిపోయిందా?

ఇంతకాలం ప్రభుత్వం మార్గదర్శి జోలికి పెద్దగా వెళ్ళలేదు. ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామోజీ రెచ్చిపోతున్నారో ఇక లాభం లేదని ప్రభుత్వం కూడా మార్గదర్శి మీద పడింది. వరసబెట్టి మీద దాడులు మొదలుపెట్టింది. నలుగురు మేనేజర్లను అరెస్టు చేసింది.

వార్ ఓపెన్ అయిపోయిందా?
X

జగన్మోహన్ రెడ్డి, రామోజీరావు మధ్య వార్ ఓపెన్ అయిపోయిందా? జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ అధికారంలోకి రానీయకూడదన్నదే రామోజీ పంతం. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీని శాశ్వ‌తంగా భూస్థాపితం చేసేయాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.


జగన్‌ను దెబ్బకొట్టడానికి రామోజీ చేయని ప్రయత్నాలు లేవు. ఇందులో భాగంగానే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు రాస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతిపనిలోనూ బొక్కలు మాత్రమే వెతుకుతూ వాటిని మాత్రమే బూతద్దంలో బాగా పెద్దది చేసి చూపిస్తున్నారు.

ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని పొరబాటున కూడా రామోజీ చూపించటం లేదు. ఇదే సమయంలో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ‌ ద్వారా రామోజీ అక్రమ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణ దశాబ్దాలుగా వినిపిస్తోంది. ఇది ఆరోపణ కాదని నిజమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సాక్ష్యాలతో సహా చెబుతున్నారు. కోర్టులో ఈ విషయం ప్రూవ్ అయినా తనకున్న పలుకుబడితో తప్పించుకుంటున్నారని ఉండవల్లి చాలాసార్లు మీడియాతో చెప్పారు.

దాన్నే ఇప్పుడు జగన్ ఆయుధంగా చేసుకున్నారు. ఇంతకాలం ప్రభుత్వం మార్గదర్శి జోలికి పెద్దగా వెళ్ళలేదు. ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామోజీ రెచ్చిపోతున్నారో ఇక లాభం లేదని ప్రభుత్వం కూడా మార్గదర్శి మీద పడింది. మామూలుగా ఎవరైనా ఏంచేస్తారంటే తమలో తప్పులు ఉన్న‌ప్పుడు ఎదుటి వ్యక్తి మీదకు వెళ్ళాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కానీ విచిత్రంగా తనలో బొక్కలు పెట్టుకుని ఎదురు ప్రభుత్వాన్ని బాగా కెలుకుతున్నారు. దాంతో వరసబెట్టి మార్గదర్శి మీద ప్రభుత్వం దాడులు మొదలుపెట్టింది. నలుగురు మేనేజర్లను అరెస్టు చేసింది. అంతేకాదు రామోజీరావు, ఆయన కోడలు శైలజతో పాటు మరికొందరు మీద పోలీసులు చీటింగ్ కేసు పెట్టారు.

రేపోమాపో రామోజీ, కోడలు తదితరులను విచారణకు రమ్మని నోటీసులివ్వబోతోంది. రాకపోతే అరెస్టులంటుంది. వాళ్ళేమో కోర్టుకు వెళ్ళి స్టే కోసం ప్రయత్నిస్తారు. నిజానికి రామోజీకి 87 ఏళ్ళ వయసులో ఇవన్నీ అవసరమా? మీడియా అన్నాక నిష్పక్షపాతంగా ఉండాలనే ఎవరైనా ఆశిస్తారు. అవసరార్థం కాస్త అటుఇటూ అయినా పర్వాలేదు కానీ చంద్రబాబు నాయుడు కోసం జగన్‌ను నిలువెల్లా ద్వేషించాల్సిన అవసరం రామోజీకి ఏమొచ్చింది? అకారణ ద్వేషం వల్లే ఇపుడు ఇద్దరి మ‌ధ్య వార్ ఓపెన్ అయిపోయింది. చివరకు ఎలా ముగుస్తుందో చూడాల్సిందే.

First Published:  13 March 2023 12:06 PM IST
Next Story