Telugu Global
Andhra Pradesh

యోగి వేమన విగ్రహం విషయంలో జరిగింది ఒకటి.. టీడీపీ అనుకూల మీడియా రాసేది మరొకటి!

కడపలోని యోగి వేమన యూనివర్సిటీలో ఉన్న వేమన విగ్రహాన్ని తొలగించి.. దాని స్థానంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్త చదివి చాలా మంది నిజమే అని భావించారు.

యోగి వేమన విగ్రహం విషయంలో జరిగింది ఒకటి.. టీడీపీ అనుకూల మీడియా రాసేది మరొకటి!
X

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడమే కొన్ని పత్రికల పనిగా మారింది. తప్పుడు వార్తలు రాయడం వల్ల ప్రజల్లో చులకన అవుతామనే సోయి కూడా లేకుండా.. టీడీపీ అనుకూల మీడియా వ్యవహరిస్తోంది. ప్రతి పక్షంలో ఉండే రాజకీయ నాయకులు అసంబద్ద ఆరోపణలు చేశారంటే అది రాజకీయం అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఏకంగా పత్రికలే ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యోగి వేమన యూనివర్సిటీకి సంబంధించి రెండు ప్రధాన తెలుగు పత్రికలు రాసిన కథనం ఇప్పుడు వారి పరువే పొగొట్టింది.

కడపలోని యోగి వేమన యూనివర్సిటీలో ఉన్న వేమన విగ్రహాన్ని తొలగించి.. దాని స్థానంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్త చదివి చాలా మంది నిజమే అని భావించారు. అయితే కొంత మంది అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఎస్వీ యూనివర్సిటీకి అనుబంధ పీజీ కాలేజీగా ఉన్న కడప పీజీ కళాశాలను వైఎస్ఆర్ హయాంలో యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. తెలుగు భాషకు వేమన చేసిన సేవకు గుర్తింపుగా కడపలోని పీజీ కాలేజీని యూనివర్సిటీగా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఇడుపులపాయలోని తన సొంత స్థలం 300 ఎకరాలకు పైగా వైఎస్ఆర్ యూనివర్సిటీకి ఇచ్చేశారు. అక్కడే వెస్ట్ క్యాంపస్ ఏర్పాటు చేశారు.

ఇటీవల కడపలోని యూనివర్సిటీలో అంతర్గత రోడ్ల విస్తీర్ణం చేపట్టారు. రెండు లేన్ల రోడ్డును నాలుగు లేన్లుగా మార్చారు. అక్కడ లోపల ఉన్న వేమన సర్కిల్‌లోని విగ్రహాన్ని ప్రధాన ద్వారం దగ్గర ఏర్పాటు చేశారు. కాగా, గతంలో వేమన విగ్రహం ఉన్న స్థలం ఖాళీగా ఉండటంతో.. యూనివర్సిటీని ఏర్పాటు చేయడమే కాకుండా, వెస్ట్ క్యాంపస్‌కు స్థలం కూడా ఇచ్చిన వైఎస్ఆర్ విగ్రహాన్ని అక్కడ ఉంచారు. అసలు జరిగిన విషయం ఇదైతే.. రెండు తెలుగు పత్రికలు మాత్రం వేమనకు తీవ్ర అవమానం జరిగిందని.. విగ్రహాన్ని పీకేసి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాయని కథనాలు వండివార్చాయి. ఇదంతా నిజమే అని చాలా మంది భావించారు.

కాగా, కొంత మంది వైఎస్ఆర్ అభిమానులు అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా.. నిజానిజాలు బయటపడ్డాయి. అక్కడ ఎలాంటి అన్యాయం, అవమానం జరగలేదని.. పైగా వేమనకు మరింత గౌరవాన్ని కలిగించేలా ప్రధాన ద్వారం వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తేలింది. నిజాలు బయటకు వచ్చిన తర్వాత కూడా టీడీపీ విమర్శలు ఆపలేదు. దేశమంతా వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టుకోండంటూ ఎద్దేవా చేస్తూ ప్రకటనలు గుప్పించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అసలు విషయం తెలుసుకోకుండా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పైగా వేమన శతకాన్ని ఉదహరిస్తూ సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. ఈ విమర్శలు, ఆరోపణలను వైసీపీ సోషల్ మీడియా ఖండించింది. తప్పుడు కథనాలు అచ్చేసిన పత్రికలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

First Published:  10 Nov 2022 5:11 PM IST
Next Story