చంద్రబాబు మధ్యంతర బెయిల్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. క్వాష్‌పై తీర్పు రిజర్వ్
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ అనిరుద్ధబోస్ ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయాన్ని కింది కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి, రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసులో 17ఏ వర్తిస్తే అన్ని అభియోగాలు తొలగినట్లే అని చంద్రబాబు తరపు లాయర్ హరీశ్ సాల్వే వాదించారు. లేకపోతే కనీసం మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. చంద్రబాబు గత 40 రోజులుగా జైల్లోనే ఉన్నారు. 73 ఏళ్ల వయసున్న వ్యక్తి కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వమని కోరారు.
మరో లాయర్ సిద్ధార్థ లూథ్రా కూడా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ అనిరుద్ధబోస్ ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయాన్ని కింది కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఇక చంద్రబాబుపై పెట్టిన రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని పెట్టిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేశారు.
జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఎదుట మంగళవారం వాదోపవాదనలు జరిగాయి. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 17ఏ వర్తించదని ముకుల్ రోహత్గీ వాదించారు. పాత నేరాలకు ఈ సెక్షన్ అసలు వర్తించదని.. 17ఏ సెక్షన్ కేవలం అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఈ సెక్షన్ అవినీతిపరుల రక్షణకు గొడుగుగా మారకూడదని రోహత్గీ అన్నారు. ప్రజాప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకునే వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఈ కేసులో ఆరోపణలు అన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే అని రోహత్గీ చెప్పారు.
వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 422 సీఆర్‌పీసీ కింద క్వాష్ చేయలేము. ఆరోపణలు ఉన్నప్పుడు చార్జిషీటు వేసి విచారణ జరిపి శిక్ష కూడా వేయవచ్చని ధర్మాసనానికి రోహత్గీ తెలిపారు. అవినీతి కేసుల కిందకు వస్తుందంటే పరిగణించండి లేదంటే క్వాష్ చేయండని ధర్మాసనానికి రోహత్గీ చెప్పారు.
చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపించారు. చట్ట సవరణ ముందు నుంచి వర్తింపచేసే అంశంపై పలు తీర్పులను ఉటంకించారు. 2019నాటి శాంతి కండక్టర్స్ కేసు, 1964 నాటి రతన్‌లాల్ కేసును ప్రస్తావించారు. ఇరు వైపుల వాదనలు విని.. తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేశారు.