Telugu Global
Andhra Pradesh

జీవో-1పై స్టే ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ.. ప్రజావేదిక కూల్చివేతపై హైకోర్టు వ్యాఖ్యలు

ఈనెల 23న హైకోర్టులో విచారణ నేపథ్యంలో.. ఈ వ్యవహారాన్ని ఇతర ధర్మాసనం కాకుండా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనమే విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

జీవో-1పై స్టే ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ.. ప్రజావేదిక కూల్చివేతపై హైకోర్టు వ్యాఖ్యలు
X

సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వానికి ఊరట లభించలేదు. రాష్ట్రంలో రహదారుల వెంబడి రాజకీయ సభలు సమావేశాలను నియంత్రిస్తూ ఇచ్చిన జీవో నంబ‌ర్‌.1ను హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రభుత్వ పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు వచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వం కోరింది.

సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. ఈనెల 23న హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతున్నందున ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమ‌ని స్పష్టం చేసింది. ఈనెల 23న హైకోర్టులో విచారణ నేపథ్యంలో.. ఈ వ్యవహారాన్ని ఇతర ధర్మాసనం కాకుండా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనమే విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు సీజే ముందు ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయం తర్వాత సుప్రీంకోర్టుకు ఆశ్రయించేందుకు అన్నిదారులు తెరిచే ఉంటాయని చెప్పింది.

అటు పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్ల నిర్మాణం వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా పాఠశాలల ఆవరణలో నిర్మించిన భవనాలను ఆయా స్కూళ్లకే అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్బంగా స్పందించిన హైకోర్టు.. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు నిర్మాణం అక్రమమని ప్రభుత్వమే అంగీకరించిందని.. అయినా సరే కూల్చడం సరికాదని పాఠశాలలకు అప్పగించినప్పుడు.. మరి ఇదే సూత్రాన్ని గతంలో ప్రజావేదికను కూల్చినప్పుడు ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది.

First Published:  20 Jan 2023 1:38 PM IST
Next Story