వరదల్లో బురద రాజకీయాలు!
భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వాళ్ళను ఆదుకోవాల్సిన రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు.
తెలుగురాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. గోదావరి నది మహోగ్ర రూపం దాల్చి తీర ప్రాంతాలను ముంచెత్తింది. భారీ వరదలకు సమీప గ్రామాలు మునినిగిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వాలు సహాయం ప్రకటించాయి. రాజకీయ నాయకులు వీరిని పరామర్శించేందుకు వరస పర్యటనలు ప్రారంభించారు. అయితే నేతలు అందిస్తున్న సహాయం కానీ, చేస్తున్న హామీలు కానీ నెరవేరడం లేదని సాయం కూడా అరకొరగానే ఉంటున్నదని ముంపు ప్రాంతాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంపా గోడు కోల్పోయి దిక్కు తోచని స్థితిలో తాము ఉంటే నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని బాధితులు విమర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గోదావరి వరదలకు మునిగిపోయిన ప్రాంతాల్లో కూనవరం మండలం ఒకటి. ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ నుంచి విడదీసి ఏపీలో విలీనం చేసిన ఏడు మండలాల్లో ఈ మండలం కూడా ఒకటి. వరదల్లో కొంపకు దూరంగా పోయి ఎక్కడో తలదాచుకుంటున్న తమకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సాయంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రహసనంగా మారిన పర్యటనలు..
సాయం మాట అటుంచితే నిలవనీడ లేని పరిస్థితుల్లో నాయకుల పర్యటనలు తమను ఇబ్బంది పెడుతున్నాయని ఆదివాసీ ప్రజలు వాపోతున్నారు. పరామర్శల పేరుతో వారు వచ్చి హామీలు గుప్పించి వెళ్ళడమే తప్ప ప్రయోజనం లేదని అంటున్నారు. ఇది ఒక ప్రహసనంగా మారిందని వరదల్లో కూడా బురద రాజకీయాలు చేస్తూ తమ రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని అనిల్ అనే ఆదివాసీ యువకుడు విమర్శించారు. "గోదావరికి వరదలు రావడం కొత్తా కాదు మా బతుకులు ఇలా మునిగిపోవడమూ కొత్తా కాదు. ఇన్ని సంవత్సరాలనుంచి నాయకులు వస్తున్నా మాకు శాశ్వత పరిష్క్రారం చూపించలేకపోవడం ఏంటని" నిలదీస్తునారు. దీన్ని బట్టి నాయకుల చిత్త శుద్ధి ఏపాటిదో అర్ధమవుతోందని ఆయన అన్నారు. 'ఆ బాబు వస్తే మేలవుతుందని..ఈ బాబు వస్తే ఒరగబెడతారని' అనుకుంటాం. కానీ వాస్తవంగా ఏ బాబు వచ్చినా మా కష్టాలు తీరేదే లేదు.. వారు తీర్చేదీ లేదు. ఎందుకంటే వారికి మా ఓట్లు కావాలి. మమ్మల్ని చీకటిలోనే ఉంచి వారు ప్రయోజనం పొందాలి. అదే నాయకుల ఉద్దేశం అని మరో ఆదివాసీ నాయకుడు అన్నారు.
మాటలు వద్దు..మేలు చేయండి!
వరదల్లో సర్వం కోల్పోయి నిస్సహాయులుగా మిగిలిన తమకు మాటలు చెప్పనవరసరం లేదని ఎంతో కొంత పరిష్కారం చూపి మేలు చేయాలని వేడుకుంటున్నారు. ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన అనుచర గణం తమ ప్రాంతాల్లో పర్యటించారని తమ దుస్థితికి బాధపడ్డారని చెప్పారు. ఇదంతా అధికార పక్షం చేతకాని తనం అంటూ ప్రభుత్వాన్ని విమర్శించి తాను వస్తే శాశ్వత పరిష్కారం కనుగొంటానని హమీ ఇచ్చి వెళ్ళి పోయారు. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ వంతు. ముంపు ప్రాంతాల ప్రజలకు పదివేల రూపాయల సహాయన్ని ఇప్పటికే ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారంనుంచి పర్యటించనున్నారు. గోదావరికి సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పర్యటనను నిర్వహించనున్నారు. లంక గ్రామాల ప్రజలను ఆయన స్వయంగా కలుసుకోనున్నారు. వారికి అందుతోన్న ప్రభుత్వ సహాయ కార్యక్రమాల గురించి నేరుగా అడిగి తెలుసుకోనున్నారు.
కుక్కనూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, ఏటపాక, వర రామచంద్రాపురం, పీ గన్నవరం, రాజోలు మండలాల పరిధిలోని గ్రామాల్లో వరదల వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అలాగే సిపిఎం పార్టీ నేతలు కూడా పర్యటించి బాధితులను పరామర్శించారు. భారీగా నిధులను ఇచ్చి ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ఇక తెలంగాణలో కూడా ముఖ్యమంత్రికి పోటాపోటీగా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళ సై కూడా వరద ప్రాంతాల్లో పర్యటించారు. పైగా ఆమె రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి భద్రాద్రికి చేరుకుని వివి|ధ గ్రామాల ప్రజలతో మాట్లాడారు. అప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్ ఆ ప్రాంతాలను సందర్శించి బాధితులకు భరోసా కల్పించడం, తగిన సాయం అందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిపోయాయి. అన్నీ అయిపోయాక ఇప్పుడు గవర్నర్ రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అయితే వరదసాయం కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసి మరిన్నినిధులు వచ్చేలా నివేదేకలు ఇవ్వాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.