వైసీపీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు
తాడికొండ వైసీపీలో భగ్గుమన్న అసంతృప్తి
రాజధాని ప్రాంత నియోజకవర్గంగా ఎప్పుడూ వార్తల్లో నిలిచే తాడికొండ..వైసీపీలోనూ నిత్యమూ హాట్ టాపిక్‌గానే నిలుస్తోంది. కేడర్‌కి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి మధ్య గ్యాప్‌తో రోజూ పత్రికల్లో వార్తలకెక్కుతోంది. లేటెస్ట్‌గా ఒక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య వివాదంగా ముదిరి మాజీ మంత్రి వైపు మళ్లింది.
ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారారు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్. శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గా డొక్కాని నియమించిన రెండు రోజుల్లోనే తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అదనపు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గం భగ్గుమంది.
నిరసనగా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలు సుచరిత ఇంటివద్ద శ్రీదేవి అనుచరులు అర్ధరాత్రి వేళ ఆందోళనకి దిగారు. అమరావతి రాజధాని నియోజకవర్గంలో కష్టపడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తాడికొండ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవిని గెలిపించుకుంటే, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఇప్పుడు తీసుకొస్తారా అంటూ నిలదీశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కు తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అదనపు ఇన్‌చార్జిగా ఎలా నియమించారని సుచరితని నిలదీశారు. 2014కి ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్, టిడిపిలో చేరారు.
2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన వెంటనే వైసీపీలోకి ఫిరాయించి ఎమ్మెల్సీ పదవి చేపట్టారు. ఇప్పుడు తాడికొండ సీటుపై కర్చీఫ్ వేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు ఆందోళన బాట పట్టారు.