శ్రీకాళహస్తి ఆలయంలో మంగ్లీ పాట చిత్రీకరణ వివాదాస్పదం
రెండు దశాబ్దాలుగా ఆలయంలోనికి కెమెరాల అనుమతి లేదు. మరి మంగ్లీ అంత సుదీర్ఘ సమయం ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో ఎలా తన బృందంతో కలిసి నృత్యాలు చేసింది..? అన్నదానిపై చర్చ నడుస్తుంది.
సినీ గాయకురాలు, ఎస్వీబీసీ సలహాదారు మంగ్లీ పాట శ్రీకాళహస్తి ఆలయంలో చిత్రీకరించడం వివాదాస్పదమైంది. ప్రముఖ శ్రీకాళహస్తి ఆలయంలో రెండు దశాబ్దాల క్రితమే వీడియో చిత్రీకరణను నిషేధించారు. అలాంటి చోట మంగ్లీ నృత్యాలు చేస్తూ పాట చిత్రీకరించడంపై విమర్శలు వస్తున్నాయి.
పాట చిత్రీకరణలో భాగంగా మంగ్లీ ఆలయంలోని పలు ప్రాంతాల్లో నృత్యం చేశారు. ఆలయంలోని కాలభైరవ స్వామి విగ్రహం వద్ద, సేవ మండపంలో స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ఉంచే చోట మంగ్లీ తన బృందంతో కలిసి నృత్యం చేశారు.
అమ్మవారి సన్నిధి నుంచి స్పటిక లింగం వరకు మంగ్లీ ఆడి పాడారు. రాహు,కేతు మండపంలో కూడా చాలా సేపు వీడియో చిత్రీకరణ జరిగింది. ప్రతి శివరాత్రి నాడు ఆమె ప్రత్యేకంగా శివుడి పై ఒక పాటను చిత్రీకరించి సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అందులో భాగంగా శ్రీకాళహస్తి ఆలయాన్ని వేదిక చేసుకుని పాటను చిత్రీకరించారు. ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టడంతో చిత్రీకరణ శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన విషయం బయటకు వచ్చింది.
రెండు దశాబ్దాలుగా ఆలయంలోనికి కెమెరాల అనుమతి లేదు. మరి మంగ్లీ అంత సుదీర్ఘ సమయం ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో ఎలా తన బృందంతో కలిసి నృత్యాలు చేసింది..? అన్నదానిపై చర్చ నడుస్తుంది. మంగ్లీ విషయంలో ఆలయ అధికారులే సహకరించారన్న విమర్శలు వస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకు రాహు, కేతు పూజలు ముగిసిన తర్వాత మండపాన్ని సాధారణంగా మూసివేస్తూ ఉంటారు. మంగ్లీ డాన్స్ చిత్రీకరణ కోసం ఆ తర్వాత కూడా ప్రత్యేకంగా మండపాన్ని తెరిచి ఉంచారని, భక్తులు వెళ్లిపోయిన తర్వాత ఆమెకు వెసులుబాటు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. అయితే మంగ్లీ వీడియో పై ఇంకా ఆలయ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎందుకు మంగ్లీకి అంతటి వెసులుబాటు ఇచ్చారు..?, ఎవరి ఒత్తిడి దాని వెనుక ఉంది..? అన్న దానిపైన చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఆలయ అధికారులకు చిక్కులు తప్పేలా లేవు.