భార్యపై అనుమానంతో కన్నకూతురిని దారుణంగా హతమార్చిన తండ్రి
ప్రకాశం జిల్లా మార్కొండాపురం గ్రామానికి చెందిన బూసిరాజు వెంకటేశ్వర్లు, పద్మాపురం గ్రామానికి చెందిన వెంకట నరసమ్మలకు 16 సంవత్సరాల క్రితం వివాహమైంది.
అతనికి భార్యపై అనుమానం. తనను వదిలి వెళ్లిపోయిందనే కోపం. అదే కోపంలో నెలకో బిడ్డను చంపుతానంటూ ఆమెను బెదిరించాడు. కోపంలో బెదిరిస్తున్నాడులే అనుకుందా తల్లి. కానీ, అన్నంత పనీ చేస్తాడని ఊహించలేకపోయింది. చివరికి కన్న కూతురును బండరాయితో మోది దారుణంగా హతమార్చాడా కసాయి తండ్రి. కన్నబిడ్డ మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదిస్తోంది ఆ తల్లి. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ దారుణం మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ మలికా గార్గ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ప్రకాశం జిల్లా మార్కొండాపురం గ్రామానికి చెందిన బూసిరాజు వెంకటేశ్వర్లు, పద్మాపురం గ్రామానికి చెందిన వెంకట నరసమ్మలకు 16 సంవత్సరాల క్రితం వివాహమైంది. కనిగిరిలో నివసిస్తున్న వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసై నిత్యం వేధిస్తుండటంతో అతన్ని భరించలేక నరసమ్మ రెండు నెలల క్రితం పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. వెంకటేశ్వర్లు తన సొంతూరు వెళ్లిపోయి అక్కడే ఉంటున్నాడు.
బతుకుదెరువు కోసం వెంకట నరసమ్మ తన సోదరుడితో కలిసి నిత్యం పద్మాపురం నుంచి కనిగిరి వచ్చి బేల్దారి పనులు చేసుకుని వెళ్లిపోతుంది. కనిగిరిలో చదువుతున్న చిన్న కుమార్తె మంజుల (13)ను తమ వెంట తీసుకొచ్చి పాఠశాలలో దిగబెడతారు. పని ముగిసిన తర్వాత సాయంత్రం తమ వెంట తీసుకెళతారు. సోమవారం సాయంత్రం యథావిధిగా కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు పాఠశాలకు వెళ్లగా మంజుల ఆమె తండ్రితో కలిసి వెళ్లినట్లు తోటి విద్యార్థులు చెప్పారు. తనతో ఇంటికి తీసుకెళ్లి ఉంటాడని భావించిన బాలిక తల్లి, మేనమామ పద్మాపురం వెళ్లిపోయారు.
సోమవారం పాఠశాలకు వెళ్లిన వెంకటేశ్వర్లు.. టీచర్ల అనుమతితో కుమార్తెను తీసుకెళ్లాడు. కుమార్తెతో పాటు బస్టాండ్ దగ్గర ఆటో ఎక్కి ఎన్.గొల్లపల్లి చెరువు సమీపంలో పద్మాపురానికి వెళ్లే రోడ్డు దగ్గర దిగాడు. అక్కడికి సమీపంలోనే ఉన్న రాళ్ల గుట్ట వరకు కుమార్తెను తీసుకెళ్లి.. ఎవరూ లేని సమయం చూసి రాళ్లతో తల, ముఖంపై మోది అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. మంగళవారం ఉదయం యథావిధిగా తన సోదరుడితో కలిసి కనిగిరి బయలుదేరిన వెంకట నరసమ్మ గొల్లపల్లి గ్రామ శివారులో తన కుమార్తెను మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల దర్యాప్తులో ఘాతుకానికి పాల్పడింది తండ్రే అని తేలింది. వెంటనే అతని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఏడు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద ఆటో చార్జీకి కూడా డబ్బులు లేకపోవడంతో కూతురే రూ.40 చెల్లించిందని ఆటో డ్రైవర్ చెప్పినట్టు ఎస్పీ వెల్లడించారు. నెలకో బిడ్డను చంపుతానని బెదిరించేవాడని.. నిజంగానే అన్నంత పనీ చేస్తాడని ఊహించలేకపోయానని మంజుల తల్లి విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
*