ఈ సీనియర్లే టీడీపీని ముంచేస్తారా? అసెంబ్లీ టికెట్‌పైనే గొడవంతా
ఇప్పుడు సమస్య ఏమిటంటే ఇద్దరూ కూడా తమతో పాటు తమ వారసులకు టికెట్లు అడుగుతున్నారు. ఒకరికి ఇచ్చి రెండువారికి కుదరదంటే ఊరుకునేట్లు లేరు. అసలు వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకేజీలే లేవని చంద్రబాబు నాయుడు ఎంతచెప్పినా ఇద్దరూ వినటంలేదు.
పార్టీలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం కలుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఉత్తరాంధ్రలోని ఇద్దరు మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఇద్దరూ పార్టీ పెట్టిన దగ్గర నుండి ఉన్నారు. ఇద్దరిదీ కొప్పుల వెలమ సామాజికవర్గమే. ఇద్దరికీ తమ నియోజకవర్గాలతో పాటు సామాజికవర్గంలో పట్టుంది. చింతకాయలది నర్సీపట్నం అయితే బండారుది పెందుర్తి నియోజకవర్గం.
ఇప్పుడు సమస్య ఏమిటంటే ఇద్దరూ కూడా తమతో పాటు తమ వారసులకు టికెట్లు అడుగుతున్నారు. ఒకరికి ఇచ్చి రెండువారికి కుదరదంటే ఊరుకునేట్లు లేరు. అసలు వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకేజీలే లేవని చంద్రబాబు నాయుడు ఎంతచెప్పినా ఇద్దరూ వినటంలేదు. దాంతో ఏం చేయాలో అర్థంకాక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. చింతకాయలకు పార్టీలో మంచిపట్టుంది. బలమైన నేతలు, క్యాడర్ మద్దతుంది.
అలాగే బండారుకు తన నియోజకవర్గంలో పట్టుంది. అంతేకాకుండా బలమైన బంధుత్వాలు కూడా ఉన్నాయి. బండారు కూతురునే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వివాహం చేసుకున్నారు. కాబట్టి బండారుకు ఒక ఎంపీతో పాటు వియ్యంకుడి హోదాలో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మద్దతుంది. అలాగే రామ్మోహన్ చెల్లెలు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మామగారైన ఆదిరెడ్డి అప్పారావు మద్దతు కూడా బండారుకుందట.
ఒకవైపు చింతకాయల మరోవైపు బండారు టికెట్ల కోసం బాగా ఒత్తిడి పెంచేస్తున్నారు. నర్సీపట్నంలో తనకు టికెట్ ఇవ్వటంతో పాటు కొడుకు చింతకాయల విజయ్‌కు అనకాపల్లి ఎంపీ టికెట్ లేదా మాడుగుల ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో పెందుర్తిలో తనతో పాటు మాడుగుల అసెంబ్లీ టికెట్ తన కొడుకు బండారు అప్పలనాయుడుకు ఇవ్వాల్సిందే అని బండారు పట్టుబడుతున్నారు. చింతకాయలతో మొదటి నుండి ఉన్న వైరం కారణంగా బండారుతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతులు కలిపారట. దాంతో ఎవరికి ఎస్ చెప్పాలి? ఎవరికి నో చెప్పాలో అర్థంకాక చంద్రబాబు అవస్థలు పడుతున్నట్లు సమాచారం. చూస్తుంటే ఆధిపత్య గొడవలతో ఇద్దరు సీనియర్లు చివరకు పార్టీని ముంచేస్తారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.