Telugu Global
Andhra Pradesh

అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 64,721 కోట్లు

శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ వెల్లడి

అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 64,721 కోట్లు
X

రాజధాని అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 64,721 కోట్లు అని ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ (ఏజీసీ)లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి కోసం రూ.64,721.48 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. వివిధ ఏజెన్సీలు, బ్యాంకుల నుంచి రుణాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందడం ద్వారా నిధులు సేకరించనున్నట్లు తెలిపారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడేళ్లలో రైతులకు అప్పగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో రైతులు 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. ప్రపంచంలో టాప్‌-5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలని రాజధానిని సీఎం డిజైన్‌ చేశారన్నారు.

రాజధానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ బ్యాంకు కలిపి రూ. 13,400 కోట్ల రుణం ఇస్తున్నాయన్నారు. కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు రూ. 5 వేల కోట్ల రుణం ఇస్తుందని.. హడ్కో నుంచి రూ. 11 వేల కోట్ల రుణం రెండు మూడు రోజుల్లో వస్తుందన్నారు. అమరావతిలో 106 ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగ సంస్థలు తమ ఆఫీసులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. సగానికిపైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలు ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. మిగతావి రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్‌, హైకోర్టు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు.

First Published:  11 March 2025 1:44 PM IST
Next Story