'పవన్ నాలుగో పెళ్లిలోపు పోలవరం నిర్మాణం' వ్యాఖ్యలపై అంబటి వివరణ
పవన్ నాలుగో పెళ్లిలోపు పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని తానన్న మాటలపై వివరణ ఇచ్చారు అంబటి రాంబాబు. పోలవరం నిర్మాణం గురించి పవన్ ఫ్యాన్స్ తనని ఎగతాళి చేశారని అలాగే వారు అనేక రకాలుగా తనను వేధించారని దాంతో తాను ఆ ఫ్యాన్స్ కోసమే అలా మాట్లాడానని చెప్పారు రాంబాబు.
విశాఖపట్నం ఎపిసోడ్ తర్వాత వైసీపీ, జనసేన మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సాగుతున్నాయి. మంత్రి అంబటి రాంబాబు కూడా వరుసగా ట్విట్టర్ వేదికగా కౌంటర్లు ఇచ్చారు. అయితే ఆయన పవన్ కళ్యాణ్ ను విమర్శించిన ప్రతిసారి ఆయన అభిమానులు అంబటి రాంబాబును టార్గెట్ చేసుకొని పోలవరం నిర్మాణం పూర్తయ్యేదెప్పుడు..నీటి పారుదల శాఖ మంత్రి గారు? అంటూ సెటైర్లు వేస్తున్నారు.
అయితే ఈ సెటైర్లపై అంబటి తీవ్రంగా స్పందించారు. 'పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లిలోపు పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నాది' అని ట్వీట్ చేశారు. అయితే ఈ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు.మీడియా ప్రతినిధుల సమక్షంలో ఆయన మాట్లాడుతూ ట్విట్టర్లో జనసైనికులు తనపై చేస్తున్న విమర్శలకు సంబంధించిన పోస్ట్ లను చూపించారు.
'పోలవరం నిర్మాణం ఎంత వరకు వచ్చింది..ఎప్పుడు పూర్తవుతుందో? ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా అంబటి?' అంటూ పవన్ ఫ్యాన్స్ తనని ఎగతాళి చేశారని చెప్పారు. అలాగే వారు ఒక ఇమేజ్ పోస్ట్ చేసి అందులో ఒక వైపు పవన్ కళ్యాణ్ ఫోటో, మరో వైపు నా ఫోటో పెట్టి నా ఫోటో వైపు చెప్పు చూపుతూ ఇమేజ్ పోస్ట్ చేశారని వివరించారు.
దీనికి సమాధానంగానే పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి లోపు పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని తాను అన్నట్లు అంబటి చెప్పారు. తానిచ్చిన ఈ సమాధానం రాష్ట్ర ప్రజలకు కాదని, తనపై సెటైర్లు వేస్తూ చెప్పు చూపుతూ ట్వీట్ చేసిన వ్యక్తికి మాత్రమేనని అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు.