Telugu Global
Andhra Pradesh

ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం మళ్లీ అదే మాట

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి 2020 ఫిబ్రవరిలో హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని ప్రతిపాదించారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లోక్‌సభలో వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం, ఏపీ హైకోర్టుల నుంచి ఉమ్మ‌డి ప్రతిపాదన వ‌స్తే కేంద్రం ప‌రిశీలిస్తుంద‌ని చెప్పారు.

ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం మళ్లీ అదే మాట
X


ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, చింతా అనురాధలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రతిపాదన ఏమైనా కేంద్ర ప్రభుత్వానికి అందిందా?.. అంది ఉంటే కేంద్ర ప్రభుత్వం అందుకు సానుకూలంగా ఉందా లేక వ్యతిరేకంగా ఉందా తదితర వివరాలను వెల్లడించాల్సిందిగా ఎంపీలు కోరారు.

ఇందుకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2014 ఏపీ విభజన చట్టం ప్రకారం అమరావతిలో హైకోర్టును ఏర్పాటు చేశారని, 2019 జనవరి ఒకటి నుంచి అక్కడే హైకోర్టు పనిచేస్తోందని వివరించారు. 2020 ఫిబ్రవరిలో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని ప్రతిపాదించారని వెల్లడించారు.

హైకోర్టు తరలింపు అంశాన్ని సదరు హైకోర్టుతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. హైకోర్టు నిర్వాహణ ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని చెప్పారు. అదే సమయంలో హైకోర్టు రోజు వారి కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యత ప్రధాన న్యాయమూర్తిపై ఉంటుందన్నారు. కాబట్టి ఏపీ ప్రభుత్వం, ఏపీ హైకోర్టు కలిసి చర్చించి ఒక నిర్ణయానికి రావాలని కేంద్రమంత్రి చెప్పారు. అలా ప్రభుత్వం, హైకోర్టు ఒక నిర్ణయానికి వచ్చి కేంద్రానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుందన్నారు. అలా ప్రతిపాదన వస్తే కేంద్రం పరిశీలిస్తుందన్నారు. ఇప్పటి వరకు అయితే అలాంటి ఉమ్మడి ప్రతిపాదన ఏదీ కేంద్రానికి రాలేదని, కాబట్టి ప్రతిపాదన‌లేవీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి సమాధానం ఇచ్చారు.

First Published:  22 July 2022 11:22 AM GMT
Next Story