Telugu Global
Andhra Pradesh

కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష

పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 42 కోట్ల రూపాయల రుణం తీసుకుని గీత దంపతులు మోసపూరితంగా ఎగ్గొట్టారన్న అభియోగం నిర్ధారణ కావడంతో శిక్ష పడింది.

కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష
X

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. కొత్త పల్లి గీత భర్త రామకోటేశ్వరరావుకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో కోర్టు ఈ శిక్ష విధించింది. మోసానికి సహకరించిన బ్యాంకు అధికారులు జయప్రకాశ్‌, అరవింద్‌కు కూడా ఐదేళ్ల జైలుశిక్ష పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 42 కోట్ల రూపాయల రుణం తీసుకుని గీత దంపతులు మోసపూరితంగా ఎగ్గొట్టారన్న అభియోగం నిర్ధారణ కావడంతో శిక్ష పడింది.

కొత్తపల్లి గీత 2014లో వైసీపీ నుంచి అరకు ఎంపీగా గెలిచారు. కొద్దికాలానికే ఆమె వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో మీడియా ముందు దర్శనం ఇచ్చేవారు. అలా చాలా కాలంగా టీడీపీకి అనుబంధంగా ఉంటూ వచ్చారు. జగన్ పాదయాత్రపైనా ఆమె విమర్శలు చేస్తూ వచ్చారు. పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రులు అవుతారా అంటూ ఆమె ప్రశ్నించేవారు. అంతలో ఆమె, ఆమె భర్త హైదరాబాద్‌లో చేసిన వందల కోట్ల రూపాయల విలువైన భూకుంభకోణం బయటపడింది.

డిప్యూటీ కలెక్టర్‌గా కొత్తపల్లి గీత పనిచేసిన సమయంలో హైదరాబాద్‌లోని విలువైన ప్రభుత్వ భూములను ఆమె సొంతానికి రాసేసుకున్నారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వమే తన భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందంటూ ఒక దశలో నాటి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. 2019లో ఆమె అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.

First Published:  14 Sept 2022 9:19 AM GMT
Next Story