Telugu Global
Andhra Pradesh

బిజీ బెజవాడలో కొత్తగా 17 విగ్రహాలకు చోటు..

నిత్యం రోడ్లు రద్దీగా ఉంటాయి. ఎప్పుడు ఏ మూలనుంచి ఏ మంత్రి కాన్వాయ్ దూసుకొచ్చినా ప్రజలు గ్రీన్ సిగ్నల్ కోసం పడిగాపులు పడాల్సిందే. అలాంటి బిజీ రోడ్ల కూడళ్లలోకి కొత్తగా 17 విగ్రహాలు వస్తున్నాయి.

బిజీ బెజవాడలో కొత్తగా 17 విగ్రహాలకు చోటు..
X

యూపీలో మాజీ సీఎం మాయావతి పాలరాతి విగ్రహాలు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. ప్రభుత్వం మారాక వాటిల్లో చాలా విగ్రహాలు బిజీరోడ్ల కూడలినుంచి వెళ్లిపోయి వేరే స్థావరాలు వెదుక్కున్నాయి. పట్టణాల్లో ఇరుకిరుకు రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతుంటే.. ఆ కాస్త ఖాళీ ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది. విగ్రహాలకు అనుమతులెలా ఇస్తారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా.. బెజవాడ కౌన్సిల్ మాత్రం ఏకగ్రీవంగా తీర్మానం చేసేసింది. విగ్రహాల ఖర్చు నిర్వాహకులే భరిస్తారని, ప్రభుత్వంపై భారం ఉండదని, ఈ విషయాన్ని రాద్ధాంతం చేయొద్దని అంటున్నారు అధికార పార్టీ నేతలు.

కొత్తగా 17విగ్రహాలు..

అమరావతి రాజధాని ప్రకటన తర్వాత బెజవాడ బాగా బిజీ అయిపోయింది. ఇటీవల ఆ హడావిడి కాస్త తగ్గినా.. నాయకులు, పాలనా వ్యవహారాలన్నీ అక్కడినుంచే కొనసాగుతున్నాయి కాబట్టి.. నిత్యం రోడ్లు రద్దీగా ఉంటాయి. ఎప్పుడు ఏ మూలనుంచి ఏ మంత్రి కాన్వాయ్ దూసుకొచ్చినా ప్రజలు గ్రీన్ సిగ్నల్ కోసం పడిగాపులు పడాల్సిందే. అలాంటి బిజీ రోడ్ల కూడళ్లలోకి కొత్తగా 17 విగ్రహాలు వస్తున్నాయి. వీటిలో దేవినేని నెహ్రూవి 8 విగ్రహాలు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని వివిధ కూడళ్లలో దేవినేని నెహ్రూ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ విగ్రహాల చుట్టూ స్మారక ప్రదేశం కూడా ఉంటుంది.

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వంగవీటి మోహన రంగా విగ్రహాలు కూడా బెజవాడలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. విజయవాడలోని 20 వీధులకు కొత్తగా రాజకీయ నాయకులు, స్థానికుల పేర్లు పెట్టే ప్రతిపాదనలకు కూడా కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. పేర్ల సంగతి పక్కనపెడితే, విగ్రహాల విషయంలోనే ఆగ్రహాలు మొదలయ్యాయి. ఇప్పటికే బెజవాడ రోడ్లపై విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోందని, కొత్తగా విగ్రహాలు పెట్టి కూడళ్లను మరింత రద్దీగా మార్చొద్దని ప్రతిపక్షాలు విన్నపాలు చేస్తున్నాయి. కానీ ఆర్డర్ పాస్ అయిపోయింది కాబట్టి.. కొత్త విగ్రహాలను అందరూ స్వాగతించాల్సిందే.

First Published:  18 Aug 2022 8:33 AM IST
Next Story