ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం అదే.. రాజీవ్ కనకాల కామెంట్స్ వైరల్
ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల పాల్గొనగా.. చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై నందమూరి కుటుంబ సభ్యులందరూ స్పందించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. ఇది రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై టీడీపీ నాయకులు ఎన్టీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు. తాజాగా ఈ విషయం గురించి బాలకృష్ణ వద్ద విలేకరులు ప్రస్తావించగా.. ఐ డోంట్ కేర్.. అంటూ సమాధానం ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉండటం వల్లే చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదని సినీ నటుడు, జూ.ఎన్టీఆర్ స్నేహితుడు రాజీవ్ కనకాల పేర్కొన్నాడు. ఎన్టీఆర్ రాజీవ్ కనకాల దాదాపు ఒకేసారి సినీ కెరీర్ మొదలుపెట్టారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఈ ఇద్దరికీ బ్రేక్ ఇచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాలో రాజీవ్ కనకాల కూడా నటిస్తున్నాడు. సినిమాల పరంగానే కాకుండా బయట కూడా ఎన్టీఆర్, రాజీవ్ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.
రాజీవ్ కనకాల తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల పాల్గొనగా.. చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. 'ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ నాలుగేళ్ల సమయాన్ని కేటాయించాడు. మామూలుగా అయితే ఈ నాలుగేళ్లలో ఎన్టీఆర్ కనీసం నాలుగైదు సినిమాల్లో నటించేవాడు. ఆ సినిమా వల్ల మరో సినిమా చేయలేకపోయాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పైగా ఇది రెండు భాగాలుగా వస్తోంది. అందుకే ఎన్టీఆర్ తన దృష్టి మొత్తాన్ని సినిమాలపై పెట్టాడు. పూర్తి సమయాన్ని సినిమాల కోసమే కేటాయించాలని భావించడం వల్లే చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదని నేను భావిస్తున్నాను' అని అన్నారు. ఇక తాను రాజకీయాల్లోకి వచ్చే విషయమై కూడా రాజీవ్ కనకాల స్పందించాడు. రాజకీయాలకు సమయం కేటాయించగలనని అనుకున్నప్పుడు కచ్చితంగా వస్తానని చెప్పాడు.