Telugu Global
Andhra Pradesh

ఏపీలో ఆ గ్రామం ప్రత్యేకం.. అందుకే అక్కడ విలీన దినోత్సవం..

1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన ముగిసింది. ఏపీలో ఉన్న నిజాం పాలిత ప్రాంతంగా పరిటాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపుని, ఇక్కడి చరిత్రను ప్రభుత్వం భావి తరాలకు తెలియజేయాలని కోరుతున్నారు స్థానికులు.

ఏపీలో ఆ గ్రామం ప్రత్యేకం.. అందుకే అక్కడ విలీన దినోత్సవం..
X

విలీనం - విమోచనం కేవలం తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకకే పరిమితం కాదు. ఏపీలోనూ నిజాం సంస్థానం మూలాలున్నాయి. నిజాం పాలననుంచి విముక్తి కలిగినందుకు ఏపీలోని ఓ గ్రామంలో స్వాతంత్ర సంబరాలు జరిగాయి. ఈ గ్రామం పేరు పరిటాల. విజయవాడ-హైదరాబాద్ రహదారిపై కృష్ణాజిల్లాలో ఉంది ఈ గ్రామం. పేరుకి కృష్ణా జిల్లా అయినా తెలంగాణ మూలాలు ఎక్కువ. ఈ గ్రామం పూర్వం నిజాం ఏలుబడిలోనే ఉండేది. అందుకే సెప్టెంబర్-17 సందర్భంగా ఇక్కడ కూడా స్వాతంత్ర సంబరాలు జరిగాయి.

నిజాం నవాబు పరిపాలించిన కాలంలో పరిటాల తాలూకాలో ఏడు గ్రామాలు ఉండేవని స్థానికులు గుర్తు చేసుకుంటారు. ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు ఉండేవని, అప్పటి నిజాం ప్రతినిధులు ఇక్కడినుంచి వజ్రాలను తరలించుకుని వెళ్లేవారని, అందుకే ఈ గ్రామాన్ని అపురూపంగా చూసుకునేవారని అంటారు. ఈ నేలను అపురూపంగా చూసుకున్నా.. ఇక్కడి ప్రజలను మాత్రం బానిసల్లాగానే చూసేవారని ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు స్థానికులు.

గణతంత్ర రాజ్యంగా..

భారత దేశానికి స్వాతంత్రం వచ్చినా పరిటాల వాసులు మాత్రం నిజాం ఏలుబడిలోనే ఉన్నారు. కానీ వారు అప్పుడే ధిక్కార స్వరం వినిపించారు. 1947 నవంబర్ 12న పోలీస్ స్టేషన్‌ పై దాడి చేశారు. ఆ తర్వాత నవంబర్ 15 న మాదిరాజు దేవరాజ్ నాయకత్వంలో పరిటాలను స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు. భారత జాతీయ జెండాను నిజాం రాజ్యంలో ధైర్యంగా ఎగురవేశారు. కానీ అధికారికంగా మాత్రం వారికి స్వాతంత్రం లభించలేదు. చివరకు 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన ముగిసింది. ఏపీలో ఉన్న నిజాం పాలిత ప్రాంతంగా పరిటాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపుని, ఇక్కడి చరిత్రను ప్రభుత్వం భావి తరాలకు తెలియజేయాలని కోరుతున్నారు స్థానికులు.

First Published:  17 Sept 2022 7:45 PM IST
Next Story