పవన్ ఆరోపణలతో పెడనలో టెన్షన్ టెన్షన్
పవన్ కల్యాణ్ ఆరోపణలతో అటు పోలీసులు కూడా హడావిడి పడుతున్నారు. పవన్ ఆరోపణలు, వైసీపీ కౌంటర్లు.. పోలీసులకు లేనిపోని తలనొప్పులు తెచ్చాయి.
పెడన వారాహి సభలో గూండాలని, క్రిమినల్స్ ని చొప్పించి దాడి చేయాలని చూస్తున్నారు.
పెడన సమావేశంలో గొడవలు సృష్టిస్తే ఊరుకోం.
శాంతిభద్రతలకు విఘాతం కలిగితే డీజీపీదే బాధ్యత.
పులివెందుల మైండ్ సెట్ ఇక్కడ చూపిస్తే ఊరుకోం.
ఎవరు ఏం చేసినా జనసైనికులు ఎదురుదాడికి దిగవద్దు.
పెడన సభలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వారాహి నాలుగో విడత మొదలు పెట్టిన పవన్.. అవనిగడ్డ, మచిలీపట్నం పర్యటన తర్వాత ఈరోజు పెడనలో అడుగు పెడతారు. సాయంత్రం పెడనలో వారాహిపైనుంచి ప్రసంగిస్తారు పవన్. ఇది మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆయన గతంలో పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పెడన సభలో తనపై దాడి చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ పవన్ ఆరోపణలు చేయడం విశేషం.
మా పెడన సభలో మీరు గొడవలు సృష్టిస్తే ఏ మాత్రం సహించం..#VarahiVijayaYatra pic.twitter.com/Mq1xIQ0uqj
— JanaSena Party (@JanaSenaParty) October 3, 2023
పెడనలో టెన్షన్ టెన్షన్..
పవన్ కల్యాణ్ ఆరోపణలతో అటు పోలీసులు కూడా హడావిడి పడుతున్నారు. ఆమధ్య చంద్రబాబు పర్యటనలో అంగళ్లులో జరిగిన దాడుల్లో పోలీసులకు గాయాలయ్యాయి. ఒకరికి కంటిచూపు కూడా పోయింది. పెడనలో కూడా అలాంటి పరిస్థితులు తలెత్తుతాయేమోననే అనుమానం అందరిలో ఉంది. గొడవలకు కారణం ఎవరైనా.. అంతిమంగా శాంతి భద్రతల వ్యవహారం పోలీసుల చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటికే పెడన సభకు అనుమతి ఇచ్చారు కాబట్టి.. ఆ కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడటం పోలీసుల బాధ్యత. ఈ దశలో పవన్ ఆరోపణలు, వైసీపీ కౌంటర్లు.. పోలీసులకు లేనిపోని తలనొప్పులు తెచ్చాయి.
ఆడలేక మద్దెల ఓడు..
పవన్ ఆరోపణలపై మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉందన్నారు. అవనిగడ్డ సభకు 300 మంది మాత్రమే వచ్చారని, అందుకే పవన్ ఫ్రస్టేషన్లో ఉన్నారని చెప్పారు. పవన్ టీడీపీ జెండా మోస్తాననేసరికి జనసైనికులు పారిపోయారన్నారు. పెడనలో గొడవలు సృష్టించాలనే కుట్రతోనే పవన్ ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు జోగి రమేష్. "నేనే వస్తా, నీతో పాటే నడుస్తా, నేనే స్వయంగా దగ్గర ఉండి పెడన నియోజకవర్గంలో నీ పర్యటన చేయిస్తా, నీ సభ సక్సెస్ అయ్యేంత వరకు పక్కనే నిలబడతా.. దమ్ముంటే ఆధారాలు చూపించు." అంటూ పవన్ కి సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్.