అటు గర్జన, ఇటు పవన్ పర్యటన.. విశాఖలో టెన్షన్ టెన్షన్
విశాఖ గర్జన సందర్భంగా నగర వ్యాప్తంగా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 1100 మంది సిబ్బంది, 15 రోప్ పార్టీలు, 6 స్పెషల్ పార్టీలు, 3 ఏపీఎస్పీ ప్లటూన్లతో బందోబస్తు నిర్వహిస్తారు.
నేడే విశాఖ గర్జన. విశాఖపట్నం పరిపాలనా రాజధాని కావాలంటూ ఉత్తరాంధ్ర ప్రజలు చేపడుతున్న ఉద్యమ శంఖారావం. దీనికి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల మద్దతు ఉంది అని చెప్పేందుకు అన్ని ప్రాంతాలనుంచి ప్రజలను తరలిస్తున్నారు. నిర్వహణ బాధ్యత విశాఖ జేఏసీదే అయినా, వెనకుండి నడిపిస్తోంది మాత్రం ప్రభుత్వం. అమరావతి రైతుల యాత్ర ఉత్తరాంధ్రకు చేరుకునే లోపు ఇక్కడ విశాఖకు మద్దతుగా మరో ఉద్యమం మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉంది. దానికి తొలిమెట్టుగా విశాఖ గర్జన పేరుతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం పోరాటం మొదలైంది.
భారీగా జన సమీకరణ
జీవీఎంసీ పరిధిలో 40వేల మహిళా సంఘాలు ఉండగా, ఆయా సంఘాల పరిధిలోని 3.20 లక్షల మంది సభ్యులు విశాఖ గర్జనకు వచ్చేలా అనధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. జీవీఎంసీ పరిధిలో వార్డు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది 15వేల మంది వరకు ఉన్నారు వారంతా ఈ కార్యక్రమానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. జీవీఎంసీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు 5,750 వరకు ఈ గర్జనకు తరలించే అవకాశముంది. మొత్తమ్మీద మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
పవన్ పర్యటన..
విశాఖ గర్జనకు పోటీగా పవన్ కల్యాణ్ ఈరోజు నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నారు. ఇందులో భాగంగా రేపు జనవాణి కార్యక్రమం పేరుతో జనాల నుంచి అర్జీలు స్వీకరించబోతున్నారు. ఈరోజు నుంచే అర్జీలకోసం ఎంట్రీలు తీసుకుంటారు. పవన్ విశాఖ పర్యటనతో జనసైనికులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికేందుకు వస్తున్నారు. అందులోనూ ఆయన గతంలో పోటీ చేసిన గాజువాక కూడా ఇక్కడే కావడంతో దీన్ని ఓ బలప్రదర్శనగా భావిస్తున్నారు పవన్. అటు గర్జన, ఇటు పవన్ పర్యటన.. ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందా అనే అంచనాలున్నాయి. ఇప్పటికే పవన్ పై మంత్రులంతా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఈరోజు గర్జనలో మరోసారి పవన్ ని, చంద్రబాబుని కూడా టార్గెట్ చేస్తారు.
పోలీసుల్లో టెన్షన్..
విశాఖ గర్జన సందర్భంగా నగర వ్యాప్తంగా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసు అధికారులు. 1100 మంది సిబ్బంది, 15 రోప్ పార్టీలు, 6 స్పెషల్ పార్టీలు, 3 ఏపీఎస్పీ ప్లటూన్లతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ర్యాలీ జరిగే రూట్ మ్యాప్ ప్రకారం బందోబస్తు విధులు కేటాయించారు. వీఐపీల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించారు. ఇతర ప్రాంతాల నుంచి గర్జనకు వచ్చే ప్రజల వల్ల నగరవాసులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామంటున్నారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.