రామోజీ, చంద్రబాబు ఇద్దరిలో టెన్షన్
జగన్ విషయంలో ఒకలాగ వ్యవహరించే ఎల్లో మీడియా చంద్రబాబు విషయంలో గాంధారి వ్రతం చేస్తోంది. ఇక్కడే రామోజీ, చంద్రబాబులో పెరిగిపోతున్న టెన్షన్ అందరికీ అర్ధమవుతోంది.
కాలం కలసిరాకపోతే ఎంతటి వారికైనా ఇబ్బందులు తప్పవు. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మొన్నటివరకు మార్గదర్శి మోసాల కేసులో రామోజీరావు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రామోజీకి తోడు చంద్రబాబునాయుడు కూడా విచారణకు రెడీ అవ్వాల్సొచ్చేట్లుంది. రు. 118 కోట్ల ముడుపులు అందుకున్న ఆరోపణలపై ఆదాయపుపన్ను శాఖ చంద్రబాబుకు మొన్నటి ఆగస్టు 4న నోటీసులు జారీ చేసింది. ఈ విషయం వెలుగుచూసిన దగ్గర నుండి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది.
ముడుపులపై సమాధానం చెప్పాలని ఐటీ శాఖ 2022, సెప్టెంబర్ 22వ తేదీనే చంద్రబాబుకు నోటీసిచ్చింది. అయితే నోటీసు విషయాన్ని చంద్రబాబు గోప్యంగా ఉంచారు. బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఆ నోటీసుకు చంద్రబాబు ఇచ్చిన సమాధానానికి ఐటి శాఖ సంతృప్తి కాలేదు. అందుకనే తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసు వ్యవహారం ఆలస్యంగానే అయినా బయటపడింది. దాంతో శుక్రవారం నుండి చంద్రబాబు మీద వైసీపీ నుండి దాడులు మొదలయ్యాయి.
మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వరసబెట్టి చంద్రబాబు మీద రెచ్చిపోతున్నారు. ముడుపులు అందాయా లేదా అన్న విషయాన్ని పక్కనపెట్టేసి అసలు ఐటి శాఖ నుండి నోటీసులు వచ్చాయా లేదా చెప్పమని మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రుల డిమాండ్ పై చంద్రబాబు స్పందించటంలేదు. ఇక ఎల్లోమీడియా అయితే కుక్కిన పేనులాగ పడుంది. చంద్రబాబు, ముడుపులు, ఐటి శాఖ, నోటీసులు అసలు తమకు ఈ విషయాలే తెలీదన్నట్లుగా వ్యవహరిస్తోంది.
ఇక్కడే రామోజీ, చంద్రబాబులో పెరిగిపోతున్న టెన్షన్ అందరికీ అర్ధమవుతోంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒకలాగ వ్యవహరించే ఎల్లో మీడియా చంద్రబాబు విషయంలో గాంధారి వ్రతం చేస్తోంది. మార్గదర్శి మోసాలపై సీఐడీ విచారణను రామోజీ ఎగ్గొడుతున్నారు. మరి ఐటి శాఖ గనుక విచారణకు రమ్మంటే చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇద్దరు కూడా నోటీసులకు సమాధానాలు చెప్పరు, విచారణకు హాజరుకారు, విచారణకు నోటీసులు వస్తే తమను విచారించే అర్హత లేదని కోర్టుకెళతారు. మరి ఐటి శాఖ నుండి మరోసారి నోటీసులు వస్తే చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.