Telugu Global
Andhra Pradesh

తుళ్లూరులో అరెస్ట్ లు.. టీడీపీకి కావాల్సినంత మసాలా

తుళ్లూరులో 144 సెక్షన్ విధించి, పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు. తుళ్లూరులో అమరావతి రైతుల దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించారు.

తుళ్లూరులో అరెస్ట్ లు.. టీడీపీకి కావాల్సినంత మసాలా
X

అమరావతిలో సెంటు భూమి విషయంలో నానా యాగీ చేయాలనుకుంటోంది టీడీపీ. అమరావతిని గేటెడ్ కమ్యూనిటీగా చేయాలనుకుంటున్న చంద్రబాబు, ఇతరులకు నో ఎంట్రీ అంటూ స్థానికులు, తన అనుకూల మీడియాతో రచ్చ చేస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటూ కోర్టు క్లియరెన్స్ తో లే అవుట్లు వేసేసింది, ఇళ్ల పట్టాల పంపిణీకీ రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకూ కేవలం మాటల తూటాలు పేలాయి. తాజాగా గుంటూరు జిల్లా తుళ్లూరులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో ఉన్నవారిని పోలీసులు ఖాళీ చేయించి స్టేషన్ కు తరలించారు.

ఆర్-5 జోన్‌ కి వ్యతిరేకంగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. అటు ఆర్-5 జోన్‌ కి మద్దతుగా వైసీపీ నాయకులు బైక్ ర్యాలీకి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తుళ్లూరులో 144 సెక్షన్ విధించి, పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు. తుళ్లూరులో అమరావతి రైతుల దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించారు.

దీక్షా శిబిరం వద్ద గందరగోళం...

తుళ్లూరులో రిలే నిరాహార దీక్షలు జరుగుతుండగా.. ఈరోజు పోలీసులు వచ్చి తమల్ని అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు రైతులు. శాంతి భద్రతల సమస్య ఉందని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. నిరసనలపై ప్రభుత్వ ఉక్కుపాదమంటూ టీడీపీ అనుకూల మీడియా రచ్చ మొదలు పెట్టింది. పోలీసులు మాత్రం రోజువారీ నిరసనలకు కూడా అనుమతి లేదని తేల్చి చెప్పారు. అక్కడకు వచ్చినవారందర్నీ అదుపులోకి తీసుకుంటున్నారు. స్థానిక టీడీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు.

First Published:  24 May 2023 2:39 PM IST
Next Story