మన పరిస్థితేంటి గురూ.. పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ఆశావహుల్లో టెన్షన్
ఉమ్మడి పశ్చిమలో ఒక్క స్థానానికీ తొలి జాబితాలో జనసేన అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు టీడీపీ ఆచంట, పాలకొల్లు, తణుకు, ఏలూరు, ఉండి, చింతలపూడి ఇలా ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
జనసేన అత్యంత బలంగా ఉన్నది మా జిల్లాలోనే.. ఇదీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆ పార్టీ నేతల మాట. అధినేత మా జిల్లావాడే. మా జిల్లాలోనే పోటీ చేస్తాడు. అదీకాక జిల్లాలో అత్యధిక సీట్లు పొత్తులో మనకే ఇస్తారు.. ఇవన్నీ ఆ పార్టీ నేతలు, కార్యకర్తల ఊహలు. కానీ, వాటన్నింటినీ పటాపంచలు చేసేశారు జనసేనాని. తొలి జాబితాలో జిల్లా నుంచి ఒక్క పేరూ లేకపోవడం, మరోవైపు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో జనసేన ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
అన్ని సీట్ల మీదా ఆశే
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. ఇందులో తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, ఏలూరు .. ఇలా అత్యధిక సీట్లు తమవేనని జనసేన నేతలు ఆశపడ్డారు. పార్టీ అధ్యక్షుడి సొంత జిల్లా కావడం, కాపులు బలంగా ఉన్న జిల్లా కావడంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ పొత్తులో అయినా ఎక్కువ స్థానాలు అడుగుతారనే ఆశతో ఉన్నారు. టికెట్ వస్తుందనే అయిదేళ్లుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని నడిపిస్తున్నారు.
ఆశలన్నీ పాయేనా..?
ఉమ్మడి పశ్చిమలో ఒక్క స్థానానికీ తొలి జాబితాలో జనసేన అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు టీడీపీ ఆచంట, పాలకొల్లు, తణుకు, ఏలూరు, ఉండి, చింతలపూడి ఇలా ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు పక్కా అనుకున్న తణుకుతోపాటు ఎంతోకొంత ఆశలున్న ఏలూరు కూడా టీడీపీకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో టికెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న తాడేపల్లిగూడెం నేత బొలిశెట్టి శ్రీను, నరసాపురం నేత బొమ్మిడి నాయకర్ తదితరులకు కంటిమీద కునుకు లేకుండా అయింది. నిడదవోలు టికెట్ వచ్చినా ఆ స్థానంలో రాజమండ్రి నుంచి వచ్చిన కందుల దుర్గేష్‌కు ఇవ్వాలన్న అధినేత ఆలోచనతో గందరగోళం నెలకొంది. మరోవైపు అధినేత భీమవరం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నదీ స్పష్టత లేక జనసేన శ్రేణులు అయోమయంగా దిక్కులు చూస్తున్నాయి.