ఎల్లో మీడియా లీకులతో జనసేన ఆశావహుల్లో కంగారు
ఎల్లో మీడియా లెక్కల్ని బట్టి ఉమ్మడి పశ్చిమలో నాలుగు సీట్లే జనసేన కోరితే ఖరారయ్యానని చెబుతున్న నరసాపురం, భీమవరం, పోలవరం కాక మరొక్కటి మాత్రమే వస్తుంది.
జనసేన 20 సీట్లలో పోటీ చేయడానికి టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మరో 5 సీట్లు కూడా జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. పవన్ 32 సీట్లు అడిగినా బాబు 25 సీట్లే ఇస్తామన్నారు.. ఇదీ నిన్నటి బాబు, పవన్ భేటీపై ఎల్లో మీడియా ఇచ్చిన లీకులు.. అంతేకాదు ఆ 20 సీట్లు ఇవీ అంటూ కూడా కొన్ని మీడియా సంస్థలు ప్రకటించేశాయి. ఆ జాబితాలో తమ నియోజకవర్గం లేకపోవడంతో టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న జనసేన నేతల్లో కంగారు మొదలైంది.
పశ్చిమలో నాలుగేనా..? మన పరిస్థితేంటి..?
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో జనసేన 4 స్థానాలు అడిగిందని, అందులోనూ భీమవరం, నరసాపురం, పోలవరం ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించిందని కథనాల సారాంశం. దీంతో ఈ జిల్లాలో కచ్చితంగా పొత్తులో టికెట్లు వస్తాయని ఆశలు పెట్టుకున్న తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జులలో కంగారు మొదలైంది. జనసేనకు పట్టున్న పశ్చిమగోదావరిలో 4 సీట్లడిగి, అంతగా పట్టులేని విశాఖ జిల్లాలో 6 సీట్లు అడగమేంటని గోదావరి జిల్లాల నేతలు సణుగుతున్నారు.
పవనే మాటిచ్చిన చోట పరిస్థితేంటి?
తణుకులో జనసేన తరఫున గత ఎన్నికల్లో విడివాడ రామచంద్రరావుకు టికెట్ ఇవ్వలేకపోయానని, అందుకు బహిరంగ సభలోనే క్షమాపణలు చెప్పారు పవన్. ఈసారి కచ్చితంగా విడివాడకే టికెట్ ఇస్తానని మాట కూడా ఇచ్చారు. ఇక తాడేపల్లిగూడెంలో ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటూ పార్టీకి ఊపు తెచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో 10కి పైగా పంచాయతీలు గెలిపించారు. టికెట్ వస్తే గెలుపు తనదేనని ధీమాతో ఉన్నారు. మరోవైపు నిడదవోలులోనూ జనసేన టికెట్ కోరుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీని గట్టెక్కించేది ఇక్కడ జనసేన ఓట్లే. కాబట్టి నిడదవోలు కావాలని జనసేన నేతలు కోరుతున్నారు.
ఎల్లో మీడియా లెక్కల్ని బట్టి ఉమ్మడి పశ్చిమలో నాలుగు సీట్లే జనసేన కోరితే ఖరారయ్యానని చెబుతున్న నరసాపురం, భీమవరం, పోలవరం కాక మరొక్కటి మాత్రమే వస్తుంది. అప్పుడు ఈ మూడు నాలుగు నియోజకవర్గాల్లో పరిస్థితేంటని ఆశావహులు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ కనిపిస్తోంది.