ఎన్టీఆర్‌ని గుర్తుచేసుకుంటున్న తెలుగు ప్రజలు..!
చంద్రబాబు పాపం పండింది.. అని చెప్పారు. తాను సోమవారం ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి ఆయనకు నివాళి అర్పిస్తానని ఆమె చెప్పడం గమనార్హం.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ని తెలుగు ప్రజలు ఇప్పుడు బాగా గుర్తుచేసుకుంటున్నారు. ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి జైలు ఊచలు లెక్కిస్తున్న వేళ ఎన్టీఆర్‌కు అప్పట్లో చంద్రబాబు చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. స్వయంగా ఆయన అల్లుడు, ఆయన ఎంతో నమ్మిన చంద్రబాబు నాయుడే ఆయన పదవిని, స్వయంగా ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన పార్టీని అక్రమంగా లాక్కోవడం.. రాజకీయంగా ఆయన్ని పతనం చేయడం.. ఆయనపైనే చెప్పులు వేయించి, మానసిక క్షోభకు గురిచేసి తీవ్ర అవమానాలకు గురిచేయడం.. అదే ఆవేదనలో ఎన్టీఆర్ మరణించడం.. ఈ విషయాలు జనం ఎప్పటికీ మరిచిపోలేనివే. మీడియా వేదికగా కొంతమంది, సోషల్ మీడియా వేదికగా మరికొంతమంది ఈ అంశంపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అయితే.. చంద్రబాబు పాపం పండింది.. అని చెప్పారు. తాను సోమవారం ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి ఆయనకు నివాళి అర్పిస్తానని ఆమె చెప్పడం గమనార్హం. చంద్రబాబు అవినీతిపరుడని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ పార్టీని లాక్కున్నారని, అలాగే ఆయన ప్రజల నుంచి గెలుచుకున్న ముఖ్యమంత్రి పదవిని కూడా లాక్కున్నారని లక్ష్మీపార్వతి చెప్పారు.
ఇక ఎన్టీఆర్‌ను విపరీతంగా అభిమానించే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అయితే.. దేవుడు న్యాయం చేశాడని చెప్పారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ని మోసం చేసి అవమానించిన సమయంలో ఎన్టీఆర్ వయసు.. ఇప్పుడు చంద్రబాబు అరెస్టయి జైలుపాలైన వయసు కూడా ఒకటేనని.. ఆయన గుర్తుచేశారు. ఇది ఎన్టీఆర్ ఆత్మ శాంతించే రోజని ఆయన చెప్పారు. బాబుకు రిమాండ్ అంటే పెద్దాయన ఎక్కడ ఉన్నా ఆనందిస్తారని ఆయన తెలిపారు. ఇక సినీ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ అయితే.. ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నా శివతాండవం చేస్తారని ట్వీట్ చేశారు. పలువురు ఎన్టీఆర్ అభిమానులైతే.. ఆయన చిత్ర పటాలకు, విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టుతో మరోసారి ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలంతా గుర్తుచేసుకుంటున్నారు.