తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు
ఏపీలో కోస్తా జిల్లాలతోపాటు, తూర్పు రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు మొదలయ్యాయి. మరో రెండురోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ, తెలంగాణలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.
తెలంగాణలో వడగండ్లు..
తెలంగాణలో ఇటీవల వడగండ్ల వానతో రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ లో కూడా అకాల వర్షంతో ప్రజలు ఇబ్బంది పడినా.. ఒక్కసారిగా వాతావరణం చల్లబడే సరికి ఊరట చెందారు. శని, ఆదివారాల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలుస్తోంది.
ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్నాటక మీదుగా కొంకన్ తీరం వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఏపీలో కోస్తా జిల్లాలతోపాటు, తూర్పు రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.