సీఎం వైఎస్ జగన్ చెప్పుల ధరపై ఏపీలో రాజకీయ దుమారం..!
సీఎం వైఎస్ జగన్ వేసుకునే చెప్పుల ధర రూ.1,34,800గా చెప్పుకొస్తున్న టీడీపీ.. ఫ్రాన్స్‌లో మొసలి చర్మంతో ఆ చెప్పుల్ని తయారు చేస్తున్నారంటోంది. ఇక జగన్ వాడే పెన్ను కూడా మాంట్ బ్లాంక్ కంపెనీకి చెందినదట.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ విమర్శలకి కాదేదీ అనర్హం అనేలా పరిస్థితి తయారైంది. సీఎం వైఎస్ జగన్ ధరించిన చెప్పుల ధరపై ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారం రేగింది. కేవలం రూపాయి జీతం తీసుకునే వైఎస్ జగన్ రూ.1,34,800 ధర ఉండే చెప్పుల్ని ధరిస్తున్నాడంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమాణారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మరీ విమర్శలు గుప్పించారు.
అలానే టీడీపీ సోషల్ మీడియా కూడా ట్రోలింగ్ స్టార్ట్ చేసింది. దాంతో వైసీపీ కూడా కౌంటర్ వేస్తూ అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఖరీదైన హిమాలయ వాటర్ బాటిల్ నీళ్లు తాగిన విషయాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. దాంతో విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం మళ్లీ వేడెక్కింది.
సీఎం వైఎస్ జగన్ వేసుకునే చెప్పుల ధర రూ.1,34,800గా చెప్పుకొస్తున్న టీడీపీ.. ఫ్రాన్స్‌లో మొసలి చర్మంతో ఆ చెప్పుల్ని తయారు చేస్తున్నారంటోంది. ఇక జగన్ వాడే పెన్ను కూడా మాంట్ బ్లాంక్ కంపెనీకి చెందినదట. దాని ధర కూడా రూ.1 లక్షపైనే ఉంటుందని టీడీపీ నేతలు చెప్తున్నారు. సీఎం జగన్ తాగే వాటర్ బాటిల్ ధర రూ.5,499 అని కూడా టీడీపీ విమర్శిస్తోంది.
ఇటీవల వైఎస్ జగన్ ఆస్తి రూ.510 కోట్ల అని మరోసారి తెరపైకి తెచ్చిన టీడీపీ.. దేశంలోనే అత్యంత సంపన్న సీఎం అంటూ ప్రచారం చేసింది. దాంతో వైసీపీ నేతలు చంద్రబాబు ఆస్తి అంతకంటే ఎక్కువగా ఉందంటూ రివర్స్‌లో కౌంటర్లు వేశారు.
ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు ఏమాత్రం ఛాన్స్ దొరికినా ప్రెస్‌మీట్స్ పెట్టి మరీ విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగతం, ఫ్యామిలీ విషయాల్ని కూడా వదలడం లేదు. అలానే సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ చెప్పులు చుట్టూనే ఏపీ రాజకీయ విమర్శలు నడుస్తున్నాయి.