Telugu Global
Andhra Pradesh

అన్న క్యాంటీన్‌పై రాజకీయం మొదలు.. ట్వీట్లు స్టార్ట్ చేసిన లోకేశ్

తెలుగుదేశం పార్టీకి అన్న క్యాంటీన్ల పేరుతో రాజకీయ అస్త్రం చిక్కింది. గత తెలుగుదేశం ప్ర‌భుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

అన్న క్యాంటీన్‌పై రాజకీయం మొదలు.. ట్వీట్లు స్టార్ట్ చేసిన లోకేశ్
X

ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం.. తద్వారా లబ్ధిపొందడం తెలుగుదేశం పార్టీకి వెన్నతోపెట్టిన విద్య. రాష్ట్రంలో ఏ చిన్న గొడవ జరిగినా తెలివిగా అధికారపార్టీ మీదకు మోపి విమర్శలు గుప్పిస్తుంటారు ఆ పార్టీ నేతలు. ఇదిలా ఉంటే తాజాగా తెలుగుదేశం పార్టీకి అన్న క్యాంటీన్ల పేరుతో రాజకీయ అస్త్రం చిక్కింది. గత తెలుగుదేశం ప్ర‌భుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పగ్గాలు చేపట్టాక వీటిని పక్కన‌ పెట్టారు.

ఇదిలా ఉంటే తాజాగా అన్న క్యాంటీన్లపై తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తోంది. ఇటీవల కుప్పం, మంగళగిరి, తెనాలి వంటి పలు చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. పట్టణాల మధ్యలో వీటిని ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో అధికారులు అన్న క్యాంటీన్లకు అనుమతి లేదంటూ పలు క్యాంటీన్లను తొలగించారు.

శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను తొలగించాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ తెలుగుదేశం శ్రేణులు భారీగా గుమిగూడటంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 'కడుపుకు అన్నం తినేవారు ఎవరూ అన్న క్యాంటీన్లను తొలగించరు' అంటూ ఆయన సీరియస్ అయ్యారు. మొత్తానికి అన్న క్యాంటీన్ల పేరుతో రాజకీయాలు చేసి లబ్ధి పొందేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది.

First Published:  3 Sept 2022 11:56 AM GMT
Next Story