Telugu Global
Andhra Pradesh

టీడీపీ ఎంపీ రాజ‌కీయాల‌కు గుడ్ బై

పార్లమెంటు కాలపరిమితి కూడా దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో ఈనెల 28వ తేదీన గుంటూరులోని ఒక ఫంక్షన్ హాలులో ముఖ్యనేతలు, కార్యకర్తలకు తల్లి, కొడుకులిద్దరూ భారీ విందు ఏర్పాటుచేశారు.

టీడీపీ ఎంపీ రాజ‌కీయాల‌కు గుడ్ బై
X

రాజకీయాలకు తెలుగుదేశంపార్టీ ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై చెప్పబోతున్నారు. జయదేవ్ ఇప్పుడు గుంటూరు ఎంపీగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణ కొడుకుగా జయదేవ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు ఎస్సీ రిజర్వుడే. అందుకనే గుంటూరు లోక్ సభ నుంచి బరిలోకి దిగారు. సూపర్ స్టార్ కృష్ణకు అల్లుడైన జయదేవ్ మామగారి సొంతగ్రామం బుర్రిపాలెం స‌ద‌రు పార్లమెంటు పరిధిలోనే ఉండటం బాగా కలిసొచ్చింది.

2014లో మొదటిసారి పోటీచేసిన జయదేవ్ వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిపై 69 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. తర్వాత 2019లో మోదుగుల వేణుగోపాలరెడ్డిపైన 4 వేల ఓట్ల మెజారిటీతో అతికష్టంమీద గెలిచారు. రెండుసార్లు జయదేవ్ గెలిచినా నియోజకవర్గంలోని చాలామంది నేతలతో సరైన సంబంధాలు లేవు. చాలామందితో కలివిడిగా ఉండక కేవలం ఓ ఐదారుమంది నేతలపైన మాత్రమే ఆధారపడి వ్యవహారాలు నడిపేవారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. నేతల్లో చాలామందితో పెద్దగా టచ్ లో కూడా ఉండేవారు కాదు.

ఇక విషయానికి వస్తే.. ప్రస్తుత రాజకీయ పరిణామాల కారణంగా కొంతకాలం రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. అమరరాజా పరిశ్రమ విస్తరణపైన ఎక్కువగా దృష్టిపెట్టిన జయదేవ్ రాజకీయాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. హైదరాబాద్, హర్యానాలో కంపెనీ విస్తరణలో భాగంగా కొత్త ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నారు. పార్లమెంటు కాలపరిమితి కూడా దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో ఈనెల 28వ తేదీన గుంటూరులోని ఒక ఫంక్షన్ హాలులో ముఖ్యనేతలు, కార్యకర్తలకు తల్లి, కొడుకులిద్దరూ భారీ విందు ఏర్పాటుచేశారు.

28వ తేదీ జ‌రిగే విందు పొలిటిక‌ల్ వీడ్కోలు విందనే చెప్పాలి. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేయటంలేదని ఇప్పటికే చంద్రబాబుకు ఎంపీ చెప్పేశారు. జయదేవ్ స్ధానంలో కొత్త అభ్యర్థిని చంద్రబాబు వెతుకుతున్నా కనబడటంలేదు. పార్లమెంటుకు పోటీచేయాలంటే అభ్యర్థి ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉండాలని అందరికీ తెలిసిందే. అంత డబ్బులు ఖర్చు పెట్టేందుకు తమ్ముళ్ళు సిద్ధంగా లేరని సమాచారం. అందుకనే పొత్తులో ఈ సీటును జనసేనకు ఇచ్చే విషయాన్ని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్ల పార్టీవర్గాల సమాచారం.

First Published:  24 Jan 2024 11:35 AM IST
Next Story