దసరాకు రిలీజవుతున్న మ్యానిఫెస్టో
నిజానికి పేదరికంలేని సమాజాన్ని నిర్మించటం ఎవరికీ సాధ్యంకాదు. పేదలకు, ధనవంతులకు మధ్య అంతరాన్ని పూడ్చటం జరిగేపనికాదు. పేదలందరినీ ధనవంతులను చేయటం కూడా అయ్యేపనికాదు.
రాబోయే దసరా పండుగకు తెలుగుదేశంపార్టీ మ్యానిఫెస్టో రిలీజ్ చేసేట్లుగా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటున్నారు. విజయదశమి రోజున మ్యానిఫెస్టోను విడుదల చేయాలని డిసైడ్ చేశారు. మ్యానిఫెస్టో రూపకల్పనకు ఇప్పటికే అనేక కమిటీలను వేశారు. కమిటీల్లోని సభ్యులంతా వివిధ అంశాలను అధ్యయనం చేస్తున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను, వాటిల్లోని లోపాలను కూడా పరిశీలిస్తున్నారు. దసరాకు రిలీజ్ అవబోయే మ్యానిఫెస్టోలో యువత, మహిళలు, రైతులను టచ్ చేయబోతున్నట్లు సమాచారం.
సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకన్నా రెట్టింపుగా తాను అమలుచేస్తానని చంద్రబాబు ఇప్పటికే చాలా చోట్ల ప్రకటించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమల్లోకి తీసుకు వచ్చే విషయాన్ని కూడా కమిటీలు పరిశీలిస్తున్నాయి. పేదరికంలేని సమాజమని, అసమానతలను రూపుమాపుతానని, పేదలను ధనవంతులను చేయాలన్నదే తనకలని చంద్రబాబు చాలా చెప్పారు. వాటిని ఏ విధంగా అమలు చేయాలనే విషయంలో కమిటీలు కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు.
నిజానికి పేదరికంలేని సమాజాన్ని నిర్మించటం ఎవరికీ సాధ్యంకాదు. పేదలకు, ధనవంతులకు మధ్య అంతరాన్ని పూడ్చటం జరిగేపనికాదు. పేదలందరినీ ధనవంతులను చేయటం కూడా అయ్యేపనికాదు. రేపటి ఎన్నికల్లో తాను పై హామీలన్నీ నెరవేరుస్తానని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటే మళ్ళీ సౌండ్ ఉండదు. పైగా ఎన్నికలముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎంతచక్కగా అమలుచేస్తారో అందరికీ అనుభవమే.
2014 ఎన్నికల్లో రిలీజ్ చేసిన మ్యానిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారిక వెబ్ సైట్ నుండి మాయంచేసిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుంది. మ్యానిఫెస్టోను ఎందుకు వెబ్ సైట్ నుండి మాయంచేశారో చెప్పాలని వైసీపీ అడుగుతుంటే చంద్రబాబు అండ్ కో ఇఫ్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్న మ్యానిఫెస్టోని అయినా ఆచరణసాధ్యంగా తయారుచేస్తే బాగుంటంది. ఆచరణసాధ్యంకాని హామీలిచ్చేయటం తర్వాత ఆ హామీలను గాలికి వదిలేయటం, మ్యానిఫెస్టోను మాయంచేసేయటం చంద్రబాబుకు బాగా అలవాటు.