గుండె పోట్లతో తెలుగుదేశం పార్టీలో ఆటుపోట్లు
ఢిల్లీలో వ్యవహారాలు చక్కదిద్దే రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా బైపాస్ సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. గన్నవరంలో వల్లభనేని వంశీకి పోటీగా దింపిన బచ్చుల అర్జునుడు పరిస్థితి గుండెపోటుతో విషమంగా మారింది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇదే సందర్భంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు శత జయంతి సంవత్సరం కూడా కావడంతో ఏడాదంతా ఉత్సవాలు చేయాలని నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీకి ప్రతీ ఏటా ఆగస్టు సంక్షోభం పేరుతో ఏదో ఒక గండం వెంటాడేది. తెలంగాణలో పోటీచేయలేని స్థితి, ఏపీలో దారుణ పరాజయం తరువాత ప్రతిపక్షంలో ఉండడమే అతి పెద్ద సంక్షోభంలా మారింది.
ఈ పరిస్థితుల్లో బలమైన వైసీపీతో పోరాడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి. ఇటువంటి పరిస్థితుల్లో కీలక నేతలు గుండెపోట్లు రావడం పార్టీ ఆటుపోట్లకు గురవుతోంది. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలోనే చికిత్స పొందుతున్నాడు. పాదయాత్ర నుంచి లోకేష్ మావయ్య, తోడల్లుడు భరత్ కూడా ఆస్పత్రిలో ఉండి తారకరత్నని చూసుకోవాల్సి వచ్చింది. దీంతో వారు పాదయాత్రకి దూరం అయ్యారు.
ఢిల్లీలో వ్యవహారాలు చక్కదిద్దే రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా బైపాస్ సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. గన్నవరంలో వల్లభనేని వంశీకి పోటీగా దింపిన బచ్చుల అర్జునుడు పరిస్థితి గుండెపోటుతో విషమంగా మారింది. పార్టీలో కీలక నేతలు వరసగా గుండెపోట్లతో ఆస్పత్రుల్లో చేరడంతో అధిష్టానం ఆందోళనకు గురవుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ, ఉరుకు పరుగులతో పనిచేయాల్సిన పరిస్థితుల్లో కీలక నేతలకి హార్ట్ ఎటాక్ రావడం అయోమయానికి గురిచేస్తోంది.