వైసీపీ నేతల కోసం తమ్ముళ్ళు ఎదురుచూస్తున్నారా..?
మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై జగన్ తన డిమాండును పట్టించుకోలేదని చెప్పి ఎంపీ పార్టీకి దూరమైపోయారు. వెంటనే తమ్ముళ్ళు రంగప్రవేశం చేశారు.
తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహారం అలాగే అనిపిస్తోంది. సింహం వేటాడి తినగా మిగిలిన ఆహారాన్ని ఎప్పుడెప్పుడు వదిలేసి వెళుతుందా..? అని ఆ పక్కన ఉండే గుంటనక్క ఎదురుచూస్తుంటుంది. సింహం వెళ్ళిపోయిందనగానే వెంటనే మిగిలిపోయిన ఆహారాన్ని నక్క దక్కించుకుంటుంది. ఏపీ ఎన్నికల సమయంలో కొంతమంది తెలుగుదేశంపార్టీ నేతల వ్యవహారం అలాగే అనిపిస్తోంది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి పోటీచేయటం ఖాయమైంది.
అయితే నెల్లూరు, కావలి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపికపై జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో విభేదించారు. ముగ్గురిని మార్చాలని వేమిరెడ్డి అడిగితే నెల్లూరు అభ్యర్థిని మాత్రం జగన్ మార్చారు. అయినా వేమిరెడ్డి తన పట్టు వదల్లేదు. దానికి జగన్ కుదరదన్నారు. దాంతో వేమిరెడ్డి అలిగి పార్టీ కార్యక్రమాలకు దూరమైపోయారు. ఈ విషయం తెలియగానే వెంటనే టీడీపీ నేతలు ఎంపీతో టచ్ లోకి వెళ్ళిపోయారు. చకచకా వేమిరెడ్డి-చంద్రబాబునాయుడుతో ఫోన్లో మాట్లాడించారు. తర్వాత హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటికి తీసుకెళ్ళారని సమాచారం.
మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై జగన్ తన డిమాండును పట్టించుకోలేదని చెప్పి ఎంపీ పార్టీకి దూరమైపోయారు. వెంటనే తమ్ముళ్ళు రంగప్రవేశం చేశారు. నెల్లూరు ఎంపీగా టికెట్ ఇచ్చేట్లు చంద్రబాబుతో హామీ ఇప్పించారు. దాంతో వేమిరెడ్డి రాజ్యసభ ఎంపీ పదవితో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేసేశారు. వెంటనే తమ్ముళ్ళంతా వేమిరెడ్డి ఇంటికి క్యూ కట్టేశారు. ఒక్క వేమిరెడ్డి విషయంలోనే కాదు జగన్ తో ఎవరు విభేదిస్తారు..? వైసీపీలో నుండి ఎవరు బయటకు వచ్చేస్తారా అని తమ్ముళ్ళు కాచుక్కూర్చున్నట్లున్నారు.
పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, మంత్రి గుమ్మనూరు జయరామ్ విషయంలో కూడా తమ్ముళ్ళు ఇలాగే వ్యవహరించారట. అంతకుముందు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి విషయంలో కూడా ఇదే జరిగిందట. జగన్ తో పలానా నేతకు విభేదాలు వస్తున్నాయి అని తెలియగానే వెంటనే వాళ్ళతో తమ్ముళ్ళు లైన్ కలుపుతున్నారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే టీడీపీలో చేరకుండానే కొలుసును నూజివీడుకు ఇన్‌చార్జిగా చంద్రబాబు నియమించేశారు.