తెలుగుదేశం పార్టీకి మళ్లీ సినిమా కళ
జగన్ మోహన్ రెడ్డిని అల్లుడూ అని ఆప్యాయంగా పిలిచే మోహన్ బాబు ఇటీవల మళ్లీ చంద్రబాబుని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గుడి ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి అంటూ ఇటీవలే చంద్రబాబు ఇంటికి వెళ్లి కలిశారు మోహన్ బాబు.
తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమతో విడదీయలేని బంధం ఉంది. ఆ బంధుత్వమూ కొనసాగుతోంది. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు దశాబ్దాలపాటు తెలుగు సినీ పరిశ్రమకి మకుటంలేని మహారాజుగా ఏలారు. అలాంటి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ సినీ పరిశ్రమతోనూ, నటులు, దర్శకులతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. రావుగోపాలరావు, సత్యనారాయణ, జమున, జయప్రద, మురళీమోహన్ వంటి వారు టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. మోహన్ బాబు, జయసుధ వంటి వారు టీడీపీకి వచ్చారు, వెళ్లారు. కవిత, రోజా, దివ్యవాణి వంటి వారి రాజకీయ ప్రయాణం టీడీపీ నుంచే మొదలు అయ్యింది.
ఎన్టీఆర్ తరువాత చంద్రబాబు హయాంలోనూ సినీ పరిశ్రమతో సంబంధాలు తగ్గుతూ వచ్చాయి. కానీ కొనసాగాయి. బాబు హయాంలో నిర్మాతలు, దర్శకులు పార్టీలో కీలకపాత్ర పోషించారు. అశ్వనీదత్, రాఘవేంద్రరావు, రవిబాబు, బోయపాటి శ్రీను వంటి వారు టీడీపీ ప్రచార కార్యక్రమాల రూపకల్పన, ఎన్నికల క్యాంపెయిన్ యాడ్స్ కూడా తయారు చేసి పార్టీ పట్ల తమ ప్రేమని చాటుకున్నారు. 2019 వరకూ ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. ఈ కాలంలోనూ సినీ పరిశ్రమ నుంచి దర్శకులు రాఘవేంద్రరావు, రాజమౌళి, మురళీమోహన్ వంటి వారి హవా సాగేది. 2019 ఘోర ఓటమి తరువాత టీడీపీకి చాలా మంది సినీ జీవులు దూరం అయ్యారు. నవ్యాంధ్రలో మళ్లీ టీడీపీ బలోపేతం అవుతుందనే సంకేతాలు అందుతున్నాయి. ఒకవేళ అధికారంలోకి వస్తే, ఆశీస్సులుంటాయనే ఆలోచనతో సినీ ప్రముఖులు మళ్లీ చంద్రదర్శనాలు ఆరంభించారు.
చంద్రబాబు పేరు వింటే అగ్గిమీద గుగ్గిలం అయిపోయే మోహన్ బాబు గత ఎన్నికల్లో టీడీపీ ఓటమే ధ్యేయంగా పనిచేశారు. జగన్ మోహన్ రెడ్డిని అల్లుడూ అని ఆప్యాయంగా పిలిచే మోహన్ బాబు ఇటీవల మళ్లీ చంద్రబాబుని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గుడి ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి అంటూ ఇటీవలే చంద్రబాబు ఇంటికి వెళ్లి కలిశారు మోహన్ బాబు. బాలయ్య షో అన్ స్టాపబుల్ కి బాబు లోకేష్ గెస్ట్‌గా వచ్చిన తరువాత మళ్లీ సినిమా సంబంధాలు పునరుద్ధరించే పనిలో పడింది టీడీపీ. సీబీఎన్ కూడా సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టమొచ్చినా పలకరిస్తున్నారు. శుభకార్యాలకు హాజరు అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తమిళ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ వరసగా బాబుని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా సమయంలో సోనూ సూద్ కూడా చంద్రబాబుతో మాట్లాడారు. నేడు తారకరత్న లోకేష్ ని కలిశారు. బెంగళూరులో కేజీఎఫ్ హీరో యష్ లోకేష్ ని కలిశారు. పరిశ్రమలకు అతీతంగా సినీ ప్రముఖులతో టీడీపీ పెద్దల భేటీలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.