తమ్ముళ్ళకు మరిన్ని షాకులు తప్పవా..?
జనసేనతో పొత్తు కారణంగానే తమకు పోటీచేసే అవకాశం కోల్పోతున్నామని గోలచేస్తుంటే ఇప్పుడు మరికొంతమందికి షాకులు తప్పేట్లులేదు.
జనసేనతో పొత్తు కారణంగానే చాలామంది తమ్ముళ్ళు షాకులు తినబోతున్నారు. సుమారు 25 నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయబోతోంది. ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ తమ్ముళ్ళు సంవత్సరాలుగా పాతుకుపోయి ఉన్నారు. జనసేనతో పొత్తు కారణంగా 25 నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు పోటీచేసే అవకాశాలను కోల్పోతున్నారు. తమ్ముళ్ళు కోల్పోయే సీట్లలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ సీటు కూడా ఉంది.
జనసేనతో పొత్తు కారణంగానే తమకు పోటీచేసే అవకాశం కోల్పోతున్నామని గోలచేస్తుంటే ఇప్పుడు మరికొంతమందికి షాకులు తప్పేట్లులేదు. ఎలాగంటే టీడీపీ-జనసేన పొత్తులో బీజేపీ కూడా చేరబోతోందని ఎల్లోమీడియా ప్రకటించేసింది. మొత్తం మీద 15 అసెంబ్లీ, 10 పార్లమెంటు సీట్లను బీజేపీ అడగబోతోందని చెప్పింది. అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు లేదా నర్సాపురం, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు లేదా నెల్లూరు, తిరుపతి, రాజంపేట, అనంతపురం లేదా హిందూపురం పార్లమెంటు స్థానాలు అడగటానికి ప్రతిపాదనలు రెడీచేసిందట. మరి ఫైనల్ గా బీజేపీ ఎన్నిసీట్లు అడుగుతుంది, చంద్రబాబు ఎన్నింటికి అంగీకరిస్తారన్నది ఇప్పుడే తెలియదు.
టీడీపీ, బీజేపీ పొత్తు కుదిరిపోయిందని, బీజేపీ ఫలానా సీట్లలో పోటీచేయాలని అనుకుంటోందని, చంద్రబాబుతో భేటీ సందర్భంగా ప్రతిపాదించబోయే సీట్లివే అని ఎల్లోమీడియా ఓ రేంజిలో ఊదరగొట్టేస్తోంది. బీజేపీతో పొత్తు నిజమే అయితే సుమారు 20 మంది సీనియర్ తమ్ముళ్ళకు షాక్ తప్పదనే అనుకోవాలి. ఇదే సమయంలో సీట్ల సర్దుబాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో జరిగినంత సాఫీగా ఉండదు. బీజేపీ జాతీయ నాయకులు చంద్రబాబు కన్నా నాలుగాకులు ఎక్కువ చదివిన వాళ్ళే.
బీజేపీతో అవసరం చంద్రబాబుకు ఉందేకాని, చంద్రబాబుతో బీజేపీకి ఏమీ అవసరంలేదు. నిజానికి రాష్ట్రంలో బీజేపీకి ఉన్న బలం సున్నా మాత్రమే. అయినా.. కమలంపార్టీతో పొత్తుకు చంద్రబాబు ఎందుకింతగా పరితపిస్తున్నట్లు..? ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కేంద్రప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం అందకుండా చూడటమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీ అండ ఉన్నంతవరకు జగన్ను ఓడించటం తమవల్ల కాదని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకనే 1శాతం ఓట్ షేర్ కూడా లేని బీజేపీతో పొత్తుకోసం తల్లకిందులుగా తపస్సుచేస్తున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.