Telugu Global
Andhra Pradesh

డిపాజిట్లు పంచుతాం.. ఆస్తులు ఇవ్వబోం.. ఏపీకి తేల్చి చెప్పిన తెలంగాణ

షెడ్యూల్ 10 కింద ఉన్న 142 సంస్థల ఆస్తులు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నాయి. అలాగే షెడ్యూల్ 9కి మరో 91 సంస్థలు ఉన్నాయి. వీటికి హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది కోట్ల విలువ చేసే భవనాలు, భూములు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి.

డిపాజిట్లు పంచుతాం.. ఆస్తులు ఇవ్వబోం.. ఏపీకి తేల్చి చెప్పిన తెలంగాణ
X

ఎమిమిదేళ్లు గడిచినా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10కి సంబంధించిన ఆస్తి వివాదాలు తెలంగాణ, ఏపీ మధ్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికి ఎన్నో సార్లు కేంద్ర హోం శాఖ సమక్షంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల భేటీలు జరిగాయి. ఆస్తుల విషయంలో రెండు రాష్ట్రాలు పట్టుబడుతుండటంతో ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. మరోసారి షెడ్యూల్ 9, 10కి సంబంధించి తమ వైఖరి ఏమిటో తెలంగాణ తేల్చి చెప్పింది. ఏపీ ప్రభుత్వం కోరుతున్నట్లుగా వాటికి సంబంధించిన ఆస్తులను పంచబోమని స్పష్టం చేసింది. అవన్నీ హైదరాబాద్‌లోనే ఉండటం గమనార్హం.

షెడ్యూల్ 9, 10కి సంబంధించిన సంస్థల బ్యాంకు డిపాజిట్లను జనాభాకి అనుగుణంగా 52:48 నిష్పత్తిలో పంచడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే ఆస్తులను మాత్రం పంచబోమని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ స్పష్టం చేసింది. ఇక ఏపీ ప్రభుత్వం కోరుతున్నట్లు సింగరేణి కాలరీస్‌లో ఎలాంటి వాటా ఇవ్వబోమని చెప్పింది. బుధవారం రెండు రాష్ట్రాల అధికారులు మరోసారి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సమక్షంలో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో తమ వైఖరి ఏమిటో తెలంగాణ ముందుగానే చెప్పేసింది.

సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని ఫైనాన్స్, ఎనర్జీ, సివిల్ సప్లయిస్, ట్రాన్స్‌పోర్ట్, ఆర్ అండ్ బీ, సింగరేణికి చెందిన సీనియర్ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. షెడ్యూల్ 9, 10 సంస్థలకు చెందిన క్యాపిటల్ హెడ్ రూ. 1,51,349 కోట్లు, లోన్లు - అడ్వాన్సుల కింద రూ. 28,099 కోట్లు, డిపాజిట్లు - అడ్వాన్సుల కింద రూ. 4,474 కోట్లు, ఇతరముల కింద రూ. 548 కోట్లు ఉన్నాయి. వీటిని ఇంత వరకు రెండు రాష్ట్రాలకు పంచలేదు. అవన్నీ ఆయా సంస్థల ఖాతాల్లోనే ఉన్నాయి.

షెడ్యూల్ 10 కింద ఉన్న 142 సంస్థల ఆస్తులు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నాయి. అలాగే షెడ్యూల్ 9కి మరో 91 సంస్థలు ఉన్నాయి. వీటికి హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది కోట్ల విలువ చేసే భవనాలు, భూములు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. వీటన్నింటినీ 52:48 నిష్పత్తిలో పంచాలని ఏపీ ఎప్పటి నుంచో కోరుతున్నది. ఇక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో చేర్చని మరో 12 సంస్థలు కూడా ఉన్నాయి. వీటిని కూడా పైన ఉన్న సంస్థలతో కలిపే విభజించాలని ఏపీ కోరుతోంది. కాగా, ఏపీ ప్రభుత్వ డిమాండ్‌ను తెలంగాణ తోసిపుచ్చుతోంది. యాక్ట్‌లో చేర్చని సంస్థలను కూడా పంచితే భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు ఎదురవుతాయని వాదిస్తోంది. దీని కోసం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్‌ను సవరించాలని పట్టుబడుతోంది.

First Published:  22 Nov 2022 1:20 AM GMT
Next Story