Telugu Global
Telangana

డీసీసీ అధ్యక్షుల్లో గుబులు.. వెంటాడుతున్న నెగెటివ్ సెంటిమెంట్

దాదాపు అరడజను మంది డీసీసీ అధ్యక్షుల ఆశలు నెరవేరేలా లేవు. పార్టీ పదవితో సరిపెట్టుకుంటే కష్టమని.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పోటీచేసి తీరాలనేది వారి కోరిక. కానీ పరిస్థితులు సహకరించట్లేదు.

డీసీసీ అధ్యక్షుల్లో గుబులు.. వెంటాడుతున్న నెగెటివ్ సెంటిమెంట్
X

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఓ నెగెటివ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులకు టికెట్లు రావు అనేదే ఆ సెంటిమెంట్. ఇప్పటికే ఇది ఇద్దరి విషయంలో రుజువైంది. విచిత్రంగా ఆ ఇద్దరూ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. ఆ ఇద్దరూ బయటకు వెళ్లిపోవడానికి ప్రత్యక్ష పరోక్ష కారణం ప్యారాచూట్ నేత మైనంపల్లి హన్మంతరావే కావడం మరో విశేషం. వీరిద్దరే కాదు, మరో ఐదుగురు డీసీసీ అధ్యక్షులకి కూడా టికెట్ గండం పొంచి ఉంది.

మేడ్చల్ మల్కాజ్ గిరి డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన నందికంటి శ్రీధర్, మెదక్ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన కంఠారెడ్డి తిరుపతి రెడ్డి.. టికెట్ల గొడవ వల్ల కాంగ్రెస్ కి దూరమై ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు. వీరిద్దరితోపాటు ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడి పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఆదిలాబాద్ టికెట్ ఆశిస్తున్నడీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, అధిష్టానం వ్యవహారశైలితో ఇబ్బంది పడుతున్నారు. ఆ టికెట్ కంది శ్రీనివాస్ రెడ్డికి ఖాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో సాజిద్ ఖాన్ భవిష్యత్ కార్యాచరణకోసం ఆలోచిస్తున్నారు.

జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. కానీ జనగామ నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బరిలోకి దిగాలనుకుంటున్నారు. అధిష్టానం మొగ్గు పొన్నాలవైపే ఉండటంతో.. ప్రతాప్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డికి కూడా ఆ సీటు దక్కేలా లేదు. అక్కడ పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి టికెట్ ఖరారవుతుందనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ.. మానకొండూరు టికెట్ ఆశిస్తుండగా.. అక్కడ జెడ్పీ మాజీ చైర్మన్ ఆరేపల్లి మోహన్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో డీసీసీ అధ్యక్షుడి పరిస్థితి ఇరకాటంలో పడింది. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, ముషీరాబాద్ సెగ్మెంట్ ని తండ్రి అంజన్ కుమార్ యాదవ్ కి త్యాగం చేయాల్సి వస్తోంది. ఇలా.. దాదాపు అరడజను మంది డీసీసీ అధ్యక్షుల ఆశలు నెరవేరేలా లేవు. పార్టీ పదవితో సరిపెట్టుకుంటే కష్టమని.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పోటీచేసి తీరాలనేది వారి కోరిక. కానీ పరిస్థితులు సహకరించట్లేదు. ఇప్పటికే ఇద్దరు డీసీసీ అధ్యక్షులు పార్టీకి గుడ్ బై చెప్పారు. మిగతావారు వేచి చూస్తారా, లేక టికెట్లు ఖరారవక ముందే కాంగ్రెస్ కి దూరమవుతారా అనేది తేలాల్సి ఉంది.

First Published:  7 Oct 2023 9:07 PM IST
Next Story