Telugu Global
Andhra Pradesh

ప్రవీణ్ ప్రకాష్ పై గురిపెట్టిన ఉపాధ్యాయ సంఘాలు

వర్క్ పుస్తకాలను దిద్దలేదని సాకుతో ఇటీవల ఒక టీచర్ ని సస్పెండ్ చేయడం ప్రవీణ్ ప్రకాష్ కు ఎంతవరకు సమంజసమని ఎస్టీయూ సంఘం ప్రశ్నించింది.

ప్రవీణ్ ప్రకాష్ పై గురిపెట్టిన ఉపాధ్యాయ సంఘాలు
X

ప్రభుత్వ పాఠశాలల్లో లోటుపాట్లను గుర్తించి వాటిని సరి చేసేందుకు ఇటీవల ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులు, అధికారులకు ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులను అప్పటికప్పుడు సస్పెండ్ చేయిస్తున్నారు.

రెండు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో పర్యటించిన ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులు , అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడున్న ఉద్యోగుల జీతాలు ఎంత..? అని అడిగి మరీ వారికి క్లాస్ తీసుకున్నారు. "మీకు జీతాలు ఇవ్వడం వేస్ట్. నేనే యూట్యూబ్ లో పాఠాలు చెబుతా.. అప్పుడు ప్రభుత్వానికి కోట్లాది రూపాయలైనా మిగులుతాయి" అంటూ ప్రవీణ్ ప్రకాష్ వ్యాఖ్యానించారు.

ఈ హెచ్చరికలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్క్ పుస్తకాలను దిద్దలేదని సాకుతో ఇటీవల ఒక టీచర్ ని సస్పెండ్ చేయడం ప్రవీణ్ ప్రకాష్ కు ఎంతవరకు సమంజసమని ఎస్టీయూ సంఘం ప్రశ్నించింది. ఇప్పటికీ స్కూళ్లకు పూర్తిస్థాయిలో పుస్తకాలు అందలేదని ఆ విషయంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని సంఘం నాయకులు ప్రశ్నించారు.

ఉపాధ్యాయులు పాఠాలు బోధించే పని మీద కాకుండా ఇతర పనులపై ఎక్కువగా కష్టపడాల్సి వస్తోందని, ముందు బోధనేతర పనులన్నింటిని రద్దు చేయాలని ఎస్టీయూ సంఘం నేతలు డిమాండ్ చేశారు. లోపాలుంటే సరి చేయాలి కానీ ఎక్కడికక్కడ టీచర్లను సస్పెండ్ చేస్తూ వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ప్రవీణ్ ప్రకాష్ వ్యాఖ్యలు ఒక విధంగా స్కూళ్ళపై దాడి చేస్తున్నట్టుగా ఉందని టీచర్ల సంఘం నాయకుడు అప్పారావు విమర్శించారు. యూట్యూబ్ లో పాఠాలు చెబుతా అని ప్రవీణ్ ప్రకాష్ వ్యాఖ్యానించడం ద్వారా టీచర్లను సమాజం దృష్టిలో దోషులుగా చూపే ప్రయత్నం చేశారని విమర్శించారు.

కేవలం టీచర్లను ఇబ్బంది పెట్టి సస్పెండ్ చేయడమే లక్ష్యంగా ప్రవీణ్ ప్రకాష్ పర్యటనలు సాగుతున్నాయని ఆరోపించారు. అయితే ఆకివీడులో ప్రవీణ్ ప్రకాష్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని జిల్లా అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. మీకు జీతాలు దండగా అని ప్రవీణ్ ప్రకాష్ అన్నది టీచర్లను ఉద్దేశించి కాదని ఆ ప్రకటనలో జిల్లా విద్యాశాఖ అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రవీణ్ ప్రకాష్ పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన వెంట మండల, జిల్లా, ప్రాంతీయ విద్యాధికారులు మాత్రమే ఉన్నారని టీచర్లు ఎవరూ అక్కడ లేరని ప్రకటనలో వివరణ ఇచ్చారు.

First Published:  30 Jan 2023 8:56 AM IST
Next Story